
- రీచులకు పర్మిషన్లు ఇవ్వొద్దని ఇటీవల ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు
- వాగుల కింద గ్రౌండ్ వాటర్ పడిపోతుండటంతో రైతుల ఆందోళన
మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక తవ్వకాలు, ఇసుక తరలింపుపై రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పర్మిషన్ల పేరుతో వాగులను ఊడ్చేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డెవలప్మెంట్వర్క్ కోసమని రెండు, మూడు వాహనాల ఇసుక తరలింపునకు పర్మిషన్తీసుకొని.. పదుల కొద్ది వాహనాల్లో ఇసుకను తరలించుకుపోతుండటంతో అడ్డుకుంటున్నారు.
గతంలోనూ అడ్డగింతలు..
- మహబూబ్‌నగర్ జిల్లా పొంటి ఊకచెట్టు వాగు, దుందుబి నదుల్లో ఇసుక తవ్వకాలపై గతం నుంచి రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యాసంగి పంటలు సాగులో ఉన్న సమయాల్లో తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వడం, ఇసుక డంపులను తరలించడాన్ని అడ్డుకుంటున్నారు.
- డిసెంబరు 15, 2021లో ఊకచెట్టు వాగు పరిధిలోని చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ వద్ద టీఎస్ఎండీసీ పర్మిషన్లు ఇచ్చింది. అదే రోజు వాగు వద్దకు జేసీబీని తీసుకొచ్చారు. మరుసటి రోజు వాగు పరిశీలనకు వచ్చిన ఆఫీసర్లను రైతులు అడ్డుకున్నారు. ఏ జీవో ప్రకారం పర్మిషన్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఇసుక తవ్వకాల వల్ల వాగు కింద పంటలు ఎండుతున్నాయని, వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇసుక తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించడంతో అనుమతులను రద్దు చేశారు.
- ఫిబ్రవరి 14, 2న మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల బార్డర్లో ఉన్న గూరకొండ చెక్ డ్యామ్ వద్ద వారం రోజుల పాటు ఆందోళన జరిగింది. ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తరలించుకుపోవడంతో గ్రామస్తులు పురుగు మందు డబ్బాలతో మహబూబ్‌నగర్-రాయచూర్ నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. దీనిపై స్పందించిన అప్పటి పాలమూరు జిల్లా ఆఫీసర్లు ఈ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ చేతులెత్తేశారు. నారాయణపేట జిల్లా ఆఫీసర్లూ అదే పని చేశారు. మధ్యలో ఎంటరైన ఓ పొలిటికల్ లీడర్ చక్రం తిప్పడంతో తర్వత ఈ ఇష్యూ బయటకు రాలేదు.
- మార్చి 2, 2023న ఉమ్మడి అడ్డాకుల మండలం వర్నే గ్రామానికి చెందిన రైతులు ఊకచెట్టు వాగు వద్ద ఆందోళనకు దిగారు. పంటలు సాగులో ఉన్న సమయంలో ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వడంపై దాదాపు నాలుగు రోజుల పాటు ధర్నా చేశారు. దిగొచ్చిన ఆఫీసర్లను తాత్కాలికంగా ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు రద్దు చేయడంతో శాంతించారు.
- డిసెంబరు 12, 2024న చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామ శివారులోని ఊకచెట్టువాగులో ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చేందుకు ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు వాగు వద్దకు చేరుకొని ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వొద్దని అడ్డుకున్నారు. వాగు కింద తాగు, సాగునీటి అవసరాలు ఉన్నందున పర్మిషన్లు ఇవ్వొద్దని వినతిపత్రం ఇచ్చారు.
- జులై 8, 2022న మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామస్తులు దుందుభీ వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. ఇసుకను తరలించొద్దని, వాగులో ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు రద్దు చేయాలని దీక్షలు కూడా చేపట్టారు. ఫిబ్రవరి 22, 2024న సీజ్ చేసిన ఇసుకను తరలిస్తుండగా.. ఇదే గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలకు, సీజ్ చేసిన ఇసుకను తరలించేందుకు అనుమతులు ఇవ్వొద్దని ధర్నా చేశారు. తాజాగా ఇదే గ్రామానికి చెందిన రైతులు దుందుభీ నుంచి ఇసుకను తరలిస్తున్న 15 టిప్పర్లను అడ్డుకున్నారు. గ్రామంలో గతంలో సీజ్ చేసిన ఇసుక డంపుల తరలించడానికి రెండు, మూడు వే బిల్లులతో అధిక మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని రాణిపేట వద్ద వాహనాలను అడ్డుకొని ఆందోళనకు దిగారు.
పర్మిషన్ల పేరుతో అక్రమాలు..
ఇసుక రవాణాలో అక్రమాలు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. 'మన పాలమూరు- మన ఇసుక'కు, రాష్ర్ట ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం కొన్ని చోట్ల ఇసుక తరలింపునకు పర్మిషన్లు ఉన్నాయి. అక్రమార్కులు పర్మిషన్ల పేరుతో పెద్ద మొత్తంలో ఇసుకను తరలించుకుపోతున్నారు. ఒకటి, రెండు వాహనాలకు అనుమతులు తీసుకొని పదుల కొద్ది వాహనాల్లో ఇసుకను దోచుకుపోతున్నారు. ఉదయం అనుమతుల మేరకు ఇసుకను తరలించి.. రాత్రిళ్లు అవే పర్మిషన్లతో మరిన్ని వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నా ఎవరూ అడ్డుకోవడం లేదు. ఇందులో కొందరు పొలిటికల్ లీడర్లు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తుండటంతో.. ఆఫీసర్లు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు
వస్తున్నాయి.