- వేరుశనగ ధర తగ్గించారంటూ ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం
- వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని మార్కెట్ చైర్‌పర్సన్ భర్తతో పాటు సెక్రటరీపై దాడి
అచ్చంపేట, వెలుగు : వ్యాపారులతో చేతులు కలిపి తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు వేరుశనగ రైతులు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ భర్తతో పాటు మార్కెట్ సెక్రటరీపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే... నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 408 మంది రైతులు 16 వేల బస్తాల వేరుశనగను సోమవారం మార్కెట్ తీసుకొచ్చారు. మూడు రోజుల కిందటి వరకు రూ. 7 వేలు పలికిన వేరుశనగ ధరను సోమవారం రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు తగ్గించారు.
దీంతో ఆగ్రహానికి గురైన రైతులు మార్కెట్ ఆఫీస్‌ను ముట్టడించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ భర్త అంతటి మల్లేశ్, మార్కెట్ సెక్రటరీ నర్సింహతో మాట్లాడేందుకు వెళ్లి వారిపై దాడి చేశారు. ఆఫీస్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం రైతులు అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి రాస్తారోకోకు దిగారు. మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో సరుకు రావడంతో రేటు తగ్గించారని, వ్యాపారులు, చైర్‌పర్సన్, సెక్రటరీ కుమ్మక్కై తమను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
మద్దతు ధర ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న చైర్‌పర్సన్ రజిత, సీఐ రవీందర్, ఎస్సై రమేశ్ రైతులతో మాట్లాడారు. వ్యాపారులతో మాట్లాడి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
వేరుశనగకు మద్దతు ధర ఇవ్వాలని రైతుల ధర్నా
కల్వకుర్తి, వెలుగు : కల్వకుర్తి మార్కెట్ యార్డుకు వచ్చిన వేరుశనగకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము వేరుశనగ పలుకులు కొన్నప్పుడు రూ. 14 వేలు తీసుకుంటున్న వ్యాపారులు, తమ పంటకు మాత్రం నాలుగైదు వేలే ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
రైతుల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్.రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్లతో మద్దతు ధర విషయంపై చర్చించారు.