
- దేవాదుల పంప్‌హౌస్ వద్ద బైఠాయించి ధర్నా
శాయంపేట, వెలుగు: చలివాగు ప్రాజెక్ట్ లోని నీటిని స్థానిక పంటలకు ఇవ్వకుండా తీసుకెళ్తే ఊరుకోబోమని ఇరిగేషన్ ఆఫీసర్లను రైతులు నిలదీశారు. దేవాదుల పంప్‌హౌస్ గేట్ లోపలే ఉంచి లాక్ వేసి బైఠాయించి నినాదాలు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్‌కుమార్‌రెడ్డి, అడ్వైజర్ పెంటారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల సీఈలు అనిల్‌కుమార్‌రెడ్డి, అశోక్‌కుమార్, ఎస్సీ వెంకటేశ్వర్లు, మెహన్రావు, ఈఈలు ప్రసాద్, సునీతతో పాటు డీఈ, ఏఈలు బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద చలివాగు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంపై ఆరా తీసేందుకు వెళ్లారు.
ప్రాజెక్టు జాలు తూము తెరిచి ఉండడంపై స్థానిక ఆఫీసర్లపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తూమును మూసి వేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు వెళ్లగా.. అప్పటికే ప్రాజెక్టు నీటిని దేవాదుల పంపుల ద్వారా ధర్మసాగర్‌కు పంపింగ్చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చలివాగులో 15 ఫీట్ల మేర నీటిని ఉంచిన తర్వాతే ధర్మసాగర్‌కు పంపింగ్చేసుకోవాలని కోరారు.
వారంపాటు నీటి పంపింగ్ఆపివేస్తే తమ పంటలు చేతికొస్తాయని పేర్కొన్నారు. అయితే.. ధర్మసాగర్ లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని అధికారులు చెప్పారు. దీంతో ప్రాజెక్టులో 15 ఫీట్లు కంటే తక్కువ ఉన్నప్పుడు నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని రైతులు మండిపడ్డారు. ఆఫీసర్లు వినకపోవడంతో పంప్‌హౌస్‌నుంచి బయటికు వెళ్లకుండా గేట్‌కు తాళం వేశారు. సుమారు గంటపాటు పంప్హౌస్వద్దనే బైఠాయించారు. దీంతో ఆఫీసర్లు నాలుగు రోజులపాటు నీటి పంపింగ్ నిలిపివేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.