- కాంక్రీటు దిమ్మెలు.. ముండ్ల కంచెలు
- డ్రోన్లతో పర్యవేక్షణ.. రోడ్లపై కందకాలు
- పోలీసుల వలయంలో దేశరాజధాని
- ఢిల్లీ–ఘజియాబాద్ రూట్ లో ట్రాఫిక్ జాం
- బార్డర్ లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు
ఢిల్లీ: సమస్యల పరిష్కారం కోరుతూ.. ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు ఇవాళ కూడా ఆందోళనను కొనసాగిస్తున్నారు. రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చ్ లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు వస్తున్నారని సమాచారంతో పంజాబ్, హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. భారీగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. సరిహద్దుల వద్ద మరిన్ని కాంక్రీటు దిమ్మెలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ–ఘజియాబాద్ బార్డర్ లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా ఉంది.
ఎల్లుండి దేశవ్యాప్త ఆందోళనలు
రైతులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంయుక్త కిసాన్ మోర్చా మండిపడింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై డ్రోన్ లను ఉపయోగించి టియర్ గ్యాస్ ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా శుక్రవారం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది.
మరోసారి బాష్పవాయువు
రాజధాని శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. రెండోరోజు శంభు సరిహద్దులో ఇవాళ తమపై బాష్ప వాయువును ప్రయోగించారని రైతులు ఆరోపించారు. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని పేర్కొన్నారు.