ఎన్​హెచ్​63 కోసం భూములు లాక్కోవద్దు .. మంచిర్యాలలో బాధిత రైతుల రాస్తారోకో

మంచిర్యాల, వెలుగు: నేషనల్​హైవే 63 కోసం తమ జీవనాధారమైన సాగు భూములను లాక్కోవద్దని డిమాండ్​ చేస్తూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. లక్సెట్టిపేట, హాజీపూర్​ మండలాలకు చెందిన సుమారు 200 మంది రైతులు మంగళవారం మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్​కు తరలివచ్చారు. భూముల విషయమై చర్చించేందుకు ఆర్డీఓ రాములును కోరగా ఆయన ఆఫీస్​ నుంచి బయటకు రాకపోవడంతో అక్కడే కాసేపు నిరసన తెలిపారు.

అనంతరం ఐబీ చౌరస్తాకు చేరుకొని రాస్తారోకో చేశారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో విలువైన సాగు భూములను కోల్పోయామని, ఇప్పుడు ఎన్​హెచ్​63 గ్రీన్​ హైవే పేరిట మిగిలిన కొద్దిపాటి భూములను లాక్కొని తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని వేడుకున్నారు. ప్రస్తుతమున్న హైవేనే ఫోర్​ లేన్​గా మార్చితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. రెవెన్యూ, ఎన్​హెచ్​ఏఐ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.