గూడూరు, వెలుగు : పోడుభూముల సర్వేలో అక్రమాలకు పాల్పడి ఇష్టారాజ్యంగా పట్టాలు పంపిణీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ, తేజావత్ రాంసింగ్‌తండా, వెంగంపేట గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కిషన్‌నాయక్ మాట్లాడుతూ పోడు భూముల సర్వేలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడి అసలు పోడు సాగే చేయని వారికి అయిదు ఎకరాలకు పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల సమక్షంలో మరోసారి రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
సర్వే పూర్తయ్యాక రైతులకు స్లిప్పులు ఇవ్వాల్సి ఉండగా అవి కూడా ఇవ్వలేదని, రహస్యంగా సర్వే చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ పట్టాలను మరోసారి పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.