
ఎడపల్లి, వెలుగు : మండలంలోని అంబం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదని సోమవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోధన్ మండలం పెగడపల్లి సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. కొందరి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, మరి కొందరి ధాన్యాన్ని కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకు కొనరని ప్రశ్నిస్తే సింగిల్ విండో కార్యదర్శి, చైర్మన్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాలని సలహా ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. నిరసన తెలిపిన వారిలో సున్నపు ఒడ్డెన్న, జుట్టు హరికృష్ణ, సున్నపు లక్ష్మయ్య, కొండెంగల సుదర్శన్, అల్లపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.