
- ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో రైతుల ఆందోళన
ఖమ్మం రూరల్, వెలుగు : ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కోవద్దంటూ పలువురు రైతులు ఆందోళనకు దిగారు. భూమి చదును చేసేందుకు వచ్చిన ఆఫీసర్లను, ఎక్స్ కవేటర్ ను అడ్డుకొని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం పట్టణంతో పాటు రూరల్ మండలంలో ఉన్న మున్నేరు వాగుకు ఇరువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భూములు కోల్పోతున్న వారికి ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ భూములను చదును చేసేందుకు గురువారం రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు, పోలీసులు వెళ్లారు.
విషయం తెలుసుకున్న రైతులు ఆఫీసర్లతో పాటు ఎక్స్ కవేటర్ ను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యాభై ఏండ్ల కింద నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్మాణంలో మట్టి కట్టల కోసం ఎన్‌ఎస్పీ ఆఫీసర్లు ఈ భూములు తీసుకున్నారని, వారు మట్టి తవ్వుకోగా మిగిలిన భూములను తాము సాగు చేసుకుంటున్నామన్నారు.
1960 నుంచి భూమి శిస్తు సైతం చెల్లిస్తున్నామని, ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి భూములు తీసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా తమ భూములు వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తమ భూములను లాక్కోవద్దని ఇప్పటికే ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం భూములు తీసుకుంటే సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ఆఫీసర్లు పనులు చేయకుండానే వెనుదిరిగారు.