మా డబ్బులు చెల్లించి.. ప్రారంభోత్సం చేసుకోండి : సంగం డైయిరీ ఎదుట రైతుల ఆందోళన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ లో ఉన్న సంగం డైయిరీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సంగం డైయిరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో వీటీ డైయిరీ పేరుతో ఈ సంస్థ నడిచేది. వీటీ డైయిరీ దివాళా తీసింది. అంతేకాకుండా పాలు పోసిన రైతులకు లక్షల రూపాయల్లో బకాయి పడింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టింది. ఈ క్రమంలోనే బ్యాంక్ అధికారులు.. వీటీ డైయిరీని.. సంగం డైయిరీకి అమ్మేశారు. 

Also Read:-హైదరాబాద్ ‘ఫిరంగి నాలా’ను అభివృద్ధి చేయాలి

వీటీ డైయిరీని టేకోవర్ చేసిన సంగం డైయిరీ.. 2024, ఆగస్ట్ 28వ తేదీ ప్రారంభోత్సవ వేడుక ఏర్పాటు చేసింది. విషయం తెలిసిన రైతులు పెద్ద సంఖ్యలో డైయిరీ దగ్గరకు వచ్చారు. పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవటంతో.. సంగం డైయిరీ ఎదుట ధర్నాకు దిగారు బాధిత రైతులు.

పాత కంపెనీకి పాలు పోశామని.. ఆ డబ్బులు ఇవ్వలేదని.. రైతులకు సెటిల్ మెంట్ చేయకుండా కొత్త యాజమాన్యం ఎలాంటి పనులు ప్రారంభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ అధికారులు, సంగం డైయిరీ యాజమాన్యం కుమ్మక్కు అయ్యి.. రైతులకు అన్యాయం చేసి.. డైయిరీని దక్కించుకుందని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని బకాయిలు ఇప్పించాలని కోరుతున్నారు రైతులు.