శాంతిఖని లాంగ్​వాల్​ప్రాజెక్టు.. మాకొద్దు: రైతులు స్థానికుల ఆందోళన

శాంతిఖని లాంగ్​వాల్​ప్రాజెక్టు.. మాకొద్దు: రైతులు స్థానికుల ఆందోళన
  • ప్రభావిత గ్రామాలకు తీవ్ర నష్టమంటూ రైతులు, స్థానికులు డిమాండ్  
  •  సింగరేణి నిర్వహించిన ఎన్విరాన్ మెంట్ రీవాలిడేషన్​పబ్లిక్​ హియరింగ్​లో ఉద్రిక్తత

కోల్ బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి పంచాయతీ పరిధి పాతమైన్ ​ఆఫీస్​ఆవరణలో శాంతిఖని గని అండర్​ గ్రౌండ్​ లాంగ్​ వాల్ ప్రాజెక్టు రీ వాలిడేషన్ ​పర్మిషన్ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ప్రభావిత గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు.  కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆదేశాలతో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్​బోర్డు ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్​కలెక్టర్ సభావత్ ​మోతీలాల్​అధ్యక్షతన, పొల్యూషన్​కంట్రోల్​బోర్డు ఈఈ లక్ష్మణ్ ప్రసాద్​పర్యవేక్షణలో గురువారం పబ్లిక్ హియరింగ్​ నిర్వహించారు. 

ఆకెనపల్లి, లింగాపూర్, బట్వాన్ పల్లి,  పెర్కపల్లి,తాళ్ల గురజాల బుచ్చయ్యపల్లి,  పాత బెల్లంపల్లి గ్రామాల ప్రజలు, రైతులు,  కార్మిక, రాజకీయ, స్వచ్ఛంద, ఎన్​జీవో సంఘాల లీడర్లు, సింగరేణి, ప్రభుత్వశాఖల అధికారులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీకి చెందిన ప్రభావిత గ్రామాల రైతులు భారీ ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. 

2004లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలు విస్మరించారని గుర్తు చేస్తూ మండిపడ్డారు.  ప్రాజెక్టు మూలంగా ప్రభావిత గ్రామాల్లో చెరువులు, కుంటలు ఎండిపోయి పంటలకు నీరు లభించక 2 వేల బోర్లు, 200 ఎకరాలకు సాగునీరు అందించే లింగాపూర్ శంకర్ చెరువు, బోర్లు ఎండిపోయి పంట పొలాలు బీడుగా మారాయని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు  సింగరేణి ఫండ్స్​ కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు లాంగ్ వాల్​పేరుతో భవిష్యత్ లో  శాంతిఖనిని ఓసీపీగా మార్చేందుకు సింగరేణి  కుట్రపూరితంగా పబ్లిక్​ హియరింగ్​ చేపట్టిందని ఆరోపించారు.  సింగరేణి ఆఫీసర్లు, పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 

రైతులు, ప్రజల డిమాండ్లు, సంక్షేమానికి సింగరేణి కృషి చేయాలని సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కాంపెల్లి సమ్మయ్య కోరారు.  ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలను అన్నివిధాల అభివృద్ధి చేస్తామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​హామీ ఇచ్చారు. పర్యావరణ అనుమతులకు ప్రభావిత గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు, సూచనలు రాష్ట్ర సర్కార్​దృష్టికి తీసుకెళ్లనున్నట్టు అడిషనల్​కలెక్టర్​తెలిపారు. 

బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు రవికుమార్​, వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో బెల్లంపల్లి, జైపూర్ సబ్​డివిజన్​పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ సమావేశంలో సింగరేణి కార్పొరేట్​జీఎం(ఎన్విరాన్​మెంట్) బానోత్​సైదులు, శాంతిఖని ఏజెంట్ అబ్దుల్​ఖాదర్, మేనేజర్​విజయ్​కుమార్ సిన్హా, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.