జగిత్యాల అష్టదిగ్బంధనం.. రోడ్డుపై రైతుల వంటావార్పు.. 

జగిత్యాల : మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాటం చేస్తున్న రైతన్నలు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా నిరసనలు కొనసాగిస్తున్నారు. అప్పట్లో స్వరాష్ట్ర సాధన కోసం రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తే  ఇప్పుడు తమ భూములు కాపాడుకునేందుకు అదే బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం జగిత్యాల అష్టదిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. అంబారీపేట్, హుస్నాబాద్ అన్నదాతలు జగిత్యాల – నిజామాబాద్ రహదారిపై బైఠాయించారు. అటు తిమ్మాపూర్, మోతె గ్రామస్థులు సైతం జగిత్యాల – పెద్దపల్లి రహదారిపై ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై వంట వండుకుని రోడ్డుపైనే కూర్చుని తిన్నారు. జై జవాన్, జైకిసాన్ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మిగతా గ్రామాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు బారులు తీరి ఇబ్బంది కలుగుతున్నా  ప్రయాణికులు మాత్రం రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల డిమాండ్ మేరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతున్నారు. మరోవైపు నర్సింగాపూర్లో గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు నిరనసలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.