కరెంట్​ కోతలను నిరసిస్తూ రైతుల రాస్తారోకో

  • నల్గొండ జిల్లా త్రిపురారం సబ్​స్టేషన్​ఎదుట ఆందోళన
  • కరెంట్​ 12 గంటలు కూడా రావట్లేదని ఆవేదన

హాలియా, వెలుగు : కరెంటు కోతలను నిరసిస్తూ నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్​సబ్​స్టేషన్​ ఎదురుగా మిర్యాలగూడ–హాలియా ప్రధాన రహదారిపై వివిధ గ్రామాల రైతులు వాహనాలను అడ్డం పెట్టి రాస్తారోకో చేశారు. రైతులు మాట్లాడుతూ సర్కారు పేరుకే 24 గంటల కరెంట్ అని మాట్లాడుతోందని, కనీసం 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదన్నారు. 

అదికూడా ఎప్పుడు వస్తుందో...ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం కరెంటు ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలన్నారు. రైతుల రాస్తారోకోతో  వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి రైతులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.