నల్లబెల్లి, వెలుగు : వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలంటూ కాంగ్రెస్ లీడర్లు, రైతులు ఆందోళనకు దిగారు. శనివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 365 హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మార్చిలో కురిసిన వడగండ్ల వర్షంతో వందలాది మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అనర్హులు, అధికార పార్టీ లీడర్లకే పరిహారం ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో వల్ల ఇరువైపులా వెహికల్స్ నిలిచిపోయాయి. విషయం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, శివారెడ్డి, అశోక్, శేఖర్, నవీన్, సాంబయ్య, రమేశ్, జనార్దన్ పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడ్డారంటూ...
నర్సంపేట, వెలుగు : పంట నష్టపరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం శివారు గురిజాల క్రాస్‌రోడ్డు వద్ద శనివారం కాంగ్రెస్ లీడర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ మాట్లాడారు. బాధిత రైతులకు పరిహారం ఇవ్వకుండా అధికార పార్టీ లీడర్లకే ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆఫీసర్లు నాయకుల ఇండ్లలో కూర్చొని లిస్ట్ రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కత్తి కిరణ్, నిరంజన్ రెడ్డి, గజ్జి రాజు, పెండ్యాల మధు పాల్గొన్నారు.
పట్టాభూమిలో వేసిన సీసీ రోడ్డుకు పరిహారం ఇవ్వాలంటూ...
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : రామప్ప టెంపుల్‌కు తూర్పు వైపున పట్టా భూముల్లో సీసీ రోడ్డు వేసినందున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం ఆందోళనకు దిగారు. రామప్పకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం తూర్పువైపున సీసీ రోడ్డు వేయాలని గతంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. దీంతో 2019లో రామప్ప ప్రహరీ పక్కన ఉన్న రైతుల పట్టా భూముల్లో సీసీ రోడ్డు వేశారు. ఈ విషయంపై రైతులు కాంట్రాక్టర్‌ను నిలదీయగా నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.