
మదనాపూరు, వెలుగు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంట సాగు చేస్తున్న రైతులకు రెండు వారాలపాటు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం ఆందోళన చేశారు. జూరాల ప్రాజెక్టు రహదారిపై అమరచింత, నందిమల్ల, మస్తీపూర్, సింగంపేట, మూలమల్ల, గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఏప్రిల్ చివరి వరకు సాగునీరు విడుదల చేస్తామని చెప్పిన అధికారులు మార్చి రెండో వారం నుంచి సాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలిగిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.
ఏప్రిల్ నెల లాస్ట్ వరకు నీటిని విడుదల చేయాలని రైతులు అధికారులను కోరారు. సీఐ శివకుమార్ ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో ప్రాజెక్టు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సీఐ స్పందించి ఆందోళనను విరమింపజేయించడంతో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.