ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ముస్తాబాద్ వెలుగు : వరి కొనుగోళ్లు వెంటనే మొదలు పెట్టాలని మండలంలోని ఆవునూరు గ్రామ రైతులు గాంధీచౌక్ వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. వరి కోతలు అయి పదిహేను రోజులు అవుతోందని, కొనుగోలు సెంటర్లకు కూడా ధాన్యం తరలించామని చెప్పారు. కానీ కొనుగోళ్లు జరగడం లేదని ఆవేదన చెందారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. ఈ  నిరసనకు మండల అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రైతులు బద్దిపడిగే సత్యం రెడ్డి, నక్కల నారాయణ రెడ్డి, నక్కల భాస్కర్ రెడ్డి, సౌల్ల క్రాంతి, చిన్ని అంజిరెడ్డి,పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ ప్రపోజల్​రద్దు చేయాలె

చొప్పదండి, వెలుగు: స్థానిక నాయకులకు చోటు లేకుండా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​పంపిన చొప్పదండి మార్కెట్​కమిటీ పాలక వర్గానికి సంబంధించిన ప్రపోజల్​ను రద్దు చేయాలని మున్సిపల్​చైర్​పర్సన్​గుర్రం నీరజ, టీఆర్​ఎస్​నాయకులు డిమాండ్​ చేశారు. నూతన  కమిటీలో చొప్పదండి వారికి స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ కౌన్సిలర్లు, టీఆర్​ఎస్​పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు ప్రెస్​మీట్​పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకులకు మార్కెట్​ కమిటీలో అవకాశం కల్పించకపోవడం బాధాకరం అన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ రూల్స్ ప్రకారం పట్టణంలో ఏర్పాటు చేసిన టీఆర్​ఎస్​ఫ్లెక్సీలను తొలగించారనే కోపంతో మున్సిపల్​సిబ్బందిని ఎమ్మెల్యే  బూతులు తిట్టి అవమానించాడని అన్నారు. ఇప్పటికైనా నూతన మార్కెటు కమిటీ ప్రపోజల్ రద్దు చేసి నాయకులందరు సూచించిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్​పర్సన్ గుర్రం నీరజరెడ్డి, ఏఎమ్​సీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్, టీఆర్​ఎస్​పట్టణ అధ్యక్షులు లోక రాజేశ్వర్​రెడ్డి, ఏఎమ్​సీ మాజీ వైస్ చైర్మెన్ కొత్త గంగారెడ్డి, కౌన్సిలర్​కొత్తూరి మహేశ్, టీఆర్​ఎస్​సీనియర్​నాయకులు రామకృష్ణ, మల్లేశం, నరేశ్, కో అప్షన్ సభ్యులు ఎండీ అజ్జు  పాల్గొన్నారు.

 ఎమ్మెల్యేపై ఆరోపణలు అర్థరహితం..

మార్కెట్ పాలకవర్గం ఏర్పాటుపై అభ్యంతరం తెలుపుతూ చొప్పదండి మున్సిపల్ చైర్​పర్సన్, పట్టణంలోని కొందరు టీఆర్​ఎస్​నాయకులు చేసిన ఆరోపణలు అర్థరహితమని మున్సిపల్​వైస్​చైర్​పర్సన్​ఇప్పనపల్లి విజయలక్ష్మి, టీఆర్​ఎస్​మండల అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్​రెడ్డి తదితరులు ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రెస్​మీట్​లో వారు మాట్లాడారు. మార్కెట్ పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు చొప్పదండి పట్టణానికి కేటాయించారన్నారు. ఈ  సమావేశంలో నాయకులు మాచర్ల వినయ్​, ఫ్యాక్స్​వైస్ చైర్మన్ ముద్దం మల్లేశం, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్​రెడ్డి, నాయకులు శ్రీనివాస్​గౌడ్, స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్ పాల్గొన్నారు. 

డిజాస్టర్​రెస్పాన్స్​టీమ్​మాక్​డ్రిల్​

తిమ్మాపూర్, వెలుగు: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, వాటి నుంచి వెలువడే విష వాయువుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత డిపార్ట్​మెంట్లు సమన్వయంతో పని చేయాలని అడిషనల్​కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. మండలంలోని పర్లపల్లిలో హరిత బయోటెక్ ఫ్యాక్టరీలో శుక్రవారం నేషనల్​డిజాస్టర్​రెస్పాన్స్ టీమ్​నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో ప్రయోగాత్మకంగా మాక్​డ్రిల్​చేసి చూపించారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా అగ్నిమాపక అధికారి టి వెంకన్న, ఎన్ డీ ఆర్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్  దామోదర్ సింగ్ పాల్గొన్నారు.

తెలంగాణ జాతికి కేసీఆర్​క్షమాపణ చెప్పాలి

జగిత్యాల, వెలుగు : ఇకనైనా నైతిక విలువలతో నిజాయితీగా పాలిస్తానని, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టబోనని ఆత్మ సాక్షిగా కేసీఆర్ ప్రమాణం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుకు కేసీఆర్ చూపిన తొవ్వలోనే బీజేపీ నడుస్తోందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్ల కొనుగోలు ఆశ్చర్యంగా ఉందన్నారు. తలసాని శ్రీనివాస్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, భాస్కర్ రావు, రెడ్యా నాయక్, యాదయ్యను ఏ విధంగా టీఆర్​ఎస్​లో చేర్చు కున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. పార్టీ ఫిరాయిపుల చట్టాన్ని ఉల్లంఘించిన వారి సభ్యత్వం రద్దు చేయాలని జానారెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేసినా.. వారి పదవీకాలం పూర్తి అయ్యేవరకు కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఇష్టారాజ్యంగా అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి అనైతిక పాలన సాగిస్తున్న కేసీఆర్​ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామచంద్ర రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శైవ క్షేత్రాలకుప్రత్యేక బస్సులు

కరీంనగర్ సిటీ, వెలుగు: కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ద శైవ క్షేత్రాలకు ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల ద్వారా శనివారం నుంచి  ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఖుస్రో షా ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని  నుంచి మంథని, కాళేశ్వరం, రామప్ప, లక్కవరం, జగిత్యాల నుంచి, కొండగట్టు, ధర్మపురి, గూడెం, మంచిర్యాల, కరీంనగర్ వన్​ డిపో నుంచి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటి లింగాల, కరీంనగర్ టు డిపో నుంచి కాళేశ్వరం, రామప్ప, లక్కవరం, వేయి స్థంబాల గుడి, కోరుట్ల నుంచి ధర్మపురి, గూడెం, కోటి లింగాల, మంథని నుంచి  కరీంనగర్, దిల్ సుఖ్​నగర్,  మంథని, కాళేశ్వరం, వేముల వాడ నుండి జేబీఎస్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి కి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

సర్పంచులకు బిల్లులు విడుదల చేయండి

కరీంనగర్​ రూరల్, వెలుగు: రూరల్​మండలంలోని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనుల బిల్లులు మంజూరుతో పాటు, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్​కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.  వైకుంఠధామాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనులు చేసినా.. కనీసం 20శాతం కూడా నిధులు రాలేదన్నారు. పంచాయతీ ద్వారా జారీ చేసిన జీపీ, ఎస్​ఎఫ్​సీ, ఎఫ్​ఎఫ్​సీ చెక్కులను ఫ్రీజింగ్​చేయకుండా విడుదల చేయాలన్నారు. వీధి దీపాలు, నీటి సరఫరా ఛార్జీలు ప్రభుత్వం ఇచ్చే నిధుల కన్న అధికంగా ఉండటంతో సరిపోవడం లేదన్నారు. సుడా ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి, లేఆవుట్​ అనుమతి ఛార్జీలను గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాలని కోరారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జె.నర్సయ్య, సర్పంచులు పాల్గొన్నారు. ​

రాజన్న సన్నిధిలో కార్తీక మాస శోభ

వేములవాడ, వెలుగు : కార్తీక మాసం కావడంతో వేములవాడ ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసంలో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ రావిచెట్టు సమీపంలో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో ఉన్నారు. గండాలు తొలిగిపోవాలని గండ దీపం వెలిగించారు. కోరిన కోర్కెలు తీరాలని స్వామి వారికి ఇష్టమైనా కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

రాజన్న సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్​లు 

వేములవాడ, వెలుగు : రాజరాజేశ్వరస్వామిని ట్రైనీ ఐఏఎస్​లు శుక్రవారం దర్శించుకున్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్​మెంట్ ఇనిస్టిట్యూట్​కు చెందిన 14 మంది అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వారితో పాటు వేములవాడ తహసీల్దార్​ రాజిరెడ్డి, ఆలయ సిబ్బంది ఉన్నారు.

క్యూఆర్ కోడ్ తో మెరుగైన సేవలు
డిజిటల్ డోర్ నంబరింగ్
మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు:  నగరంలోని 86వేల ఇండ్లకు త్వరలో డిజిటల్ డోర్ నంబరింగ్ చేయబోతున్నామని మేయర్ యాదగిరి సునీల్ రావు చెప్పారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిజిటల్ డోర్ నెంబరింగ్ తో ఇంటి లొకేషన్ ను ఈజీగా గుర్తించవచ్చన్నారు. దీంతో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ పన్నులు చెల్లించడం సులభం అవుతుందన్నారు. అధికారులు ఫీల్డ్​విజిట్ చేసి ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ మహేందర్, డీఈవో ఓం ప్రకాష్, టిపిఎస్ శ్రీహరి, ఆర్ ఒ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

రెండోరోజు కొనసాగిన కిసాన్ మేళా

కరీంనగర్ టౌన్,వెలుగు: కిసాన్ మేళా శుక్రవారం రెండోరోజూ సందడిగా కొనసాగింది. ఈ సందర్భంగా -కిసాన్ జాగరణ్‍జాతీయ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ.. రైతులు సాంప్రదాయ పంటలు పండించాలని, గతంలో ఊర్లలో ఉన్న గొర్లు, ఆవులు, గేదెలు, మేకలతో పాటు  పశు సంపద ప్రస్తుతం తగ్గుతోందని చెప్పారు. రైతు ఆర్థికంగా ఎదగాలంటే చేపలు, పామ్ ఆయిల్, వెదురు పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గొర్రెలు, కోళ్ల ఫామ్స్ కు అందే సబ్సిడీలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, హన్మంతరెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, లింగంపల్లి శంకర్, దుర్గం మారుతి పాల్గొన్నారు.