సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎన్ని గంటలు ఎదురు చూసినా అధికారులు యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. సహకార సంఘానికి వచ్చిన రెండు లారీల యూరియా ఏమైందని అధికారులను ప్రశ్నించారు. దీంతో సమాధానాలు చేప్పలేక అధికారులు మాట దాటి వేస్తున్నారని ఆరోపించారు.
గోదాంలో ఎన్ని కట్టల యూరియా బస్తాలు ఉన్నాయో చూపించాలని రైతుల డిమాండ్ చేశారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ : వరంగల్ సీపీకి రఘునందన్ సవాల్
ఇప్పటికే నీళ్లు లేక పంటలు దెబ్బతింటుంటే.. యూరియాను కూడా అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సఫ్లైలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
అన్ని విధాల తమను ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఎరువుల కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని రైతులు వాపోతున్నారు. వెంటనే రైతులకు కావాల్సిన యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.