ఆదిలాబాద్, వెలుగు: శనగ పంటను సర్కారు కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ రైతులు రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట శనగలను కుప్పగా పోసి ధర్నా చేశారు. మద్దతుగా తరలివచ్చిన బీజేపీ నేతలతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం కొనకపోవడంతో దళారులు మద్దతు ధర కంటే రూ. 1,200 తక్కువకు కొంటున్నారని..దళారులకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారం రోజుల్లోగా కొనుగోలు సెంటర్లను ప్రారంభించి, మద్దతు ధరతో శనగలు కొనాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీ నిర్వహించారు.
ఒక్కో క్వింటాల్ పై రూ.1,200 నష్టం
ఆదిలాబాద్ జిల్లాలో రబీలో 73 వేల ఎకరాల్లో శనగ పండించగా, దాదాపు ఆరు లక్షల క్వింటాళ్ల దిగుబడి పొందారు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.5,100 కాగా, రూ.3,900కే కొంటున్నారు. దీంతో రైతులు ఒక్కో క్వింటాల్పై రూ.1,200 దాకా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులను, ఆఫీసర్లను కలిసినా పట్టించుకోలేదని, దీంతో ఆందోళనకు దిగామని రైతులు చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ.. ఖరీఫ్లో పత్తి వేసి నష్టపోయిన రైతులు, ఆ పంటను ముందుగానే దున్ని శనగ వేసుకున్నారని చెప్పారు. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు తెరవకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. వారం రోజుల్లోగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి, రూ.5,100 మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నం
కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదుట శనగ కుప్పలతో భైఠాయించిన రైతులు, బీజేపీ లీడర్లు.. రాష్ట్ర సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జేసీ సంధ్యారాణి.. ఆందోళనకారుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.