
- బంజేరుపల్లి కెనాల్ లో దిగి రైతుల ధర్నా
సిద్దిపేట రూరల్ , వెలుగు: సాగు చేయడానికి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నారాయణరావుపేట మండలం బంజేరు పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు వాపోయారు. బుధవారం బంజేరుపల్లి, కోదండరావుపల్లి గ్రామాల మధ్యలో ఉన్న 9 నెంబర్ కెనాల్ వద్ద వారు సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ కాలువలో కూర్చొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రంగనాయక సాగర్ నుంచి పంటల కోసం కాలువల ద్వారా నీటిని విడుదల చేసినప్పటికీ 7, 8 నెంబర్ కాలువల వద్ద కొంతమంది వ్యక్తులు గేట్లను ధ్వంసం చేసి, నీటిని వేరే వైపు మళ్లించారని ఆరోపించారు. దీంతో తమకు నీళ్లు రాకుండా పోయాయని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బంజరుపల్లి గ్రామాలకు చెందిన రైతులు చందు, కొండల్ రెడ్డి, మల్లేశం, నరసయ్య పాల్గొన్నారు.