యూరప్ దేశాల్లో రైతులు రోడెక్కారు. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోలండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్, బెల్జియం వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలో కోత విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఆయా దేశాల ప్రధాన నగరాలతోపాటు పట్టణాలల్లో రైతులు ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున వాహనాలతో రోడ్లన్నింటినీ దిగ్బంధించారు. రైతులపై పన్నుల భారం తగ్గించాలని.. రైతులకు ఇచ్చే సబ్సీడీలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తూ.. రోడ్లపై వాహనాల టైర్లు, గడ్డిమోపులను వేసి తగలబెడుతున్నారు.
దీంతో యూరప్ దేశాల్లో భారీగా ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటుచుసుకుంటున్నాయి. ఆందోళనలు.. ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుండడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు.
యూరప్ దేశాల్లోని ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్‌పై పన్ను వాపసుతో పాటు ట్రాక్టర్లపై మినహాయింపులను రద్దు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వాల నిర్ణయాలపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. ఆందోళన చేస్తున్నారు.