- అడ్డుపడ్డ పోలీసుల కాళ్లపై పడ్డ అన్నదాతలు
నల్గొండ అర్బన్, వెలుగు : రుణమాఫీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని నల్గొండ మండల పరిధిలోని జి.చెన్నారం గ్రామానికి చెందిన పలువురు రైతులు నల్గొండ పట్టణంలోని కెనరా బ్యాంకు ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. గ్రామంలో సుమారు 120 మంది రైతులు ఉండగా, ఈ ఊరి రైతులందరికీ నల్గొండ పట్టణంలోని కెనరా బ్యాంకే రుణాలు అందజేస్తోంది. అయితే, రుణమాఫీ చేసిన ప్రతిసారీ బ్యాంకు సిబ్బంది సతాయిస్తున్నారని వాపోయారు. గత పదేండ్లుగా ఇదే తీరు అవలంభిస్తున్నారని ఆవేదన చెందారు. అడిగితే ప్రభుత్వం నుంచి తమకు డబ్బులు రాలేదని చెబుతున్నారని ఆరోపించారు. సమాచారం ఇచ్చినప్పుడే రావాలని, అప్పటివరకు ఎవరూ బ్యాంకు వైపు రావొద్దని అంటున్నారని చెప్పారు. బ్యాంకులో రుణమాఫీ కాక కొత్త రుణాలు ఇవ్వక తిప్పలు పడుతున్నామన్నారు.
అధికారులు బ్యాంకు సిబ్బందితో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి నిరసన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా పోలీసుల కాళ్లపై పడ్డారు. రుణమాఫీ చేయించాలని, కొత్త రుణాలు ఇచ్చేలా చూడాలని వేడుకున్నారు. దీంతో పోలీసులు రైతుల ఆవేదన అర్థమైందని, కాకపోతే రెండువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రైతులు కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు.