అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి.. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు: అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట టీఏజీఎస్ (తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) అధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ ఆదివాసీ జిల్లాలో సక్రమంగా అమలు కాలేదని ఆరోపించారు. దీనికి  కారణమైన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

.3జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈనెల 31 లోపు రుణమాఫీ చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొరెంగ మాలశ్రీ, ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మాడవి గణపతి, కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలె సాయి కృష్ణ, రైతులు పాల్గొన్నారు.