పంటలు ఎండిపోతున్నాయంటూ కలెక్టరేట్‌ ఎదుట రైతుల నిరసన

సూర్యాపేట, వెలుగు: ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన బాట పట్టారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్‌(ఎస్‌), పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నూతనకల్‌ కు చెందిన రైతు మల్లారెడ్డి  పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు డబ్బాను లాక్కున్నారు.

అయితే, ఇందులో పురుగుల మందు లేదని, నీళ్లు పోసి తాగుతామని బెదిరించారని ఇంటెలిజెన్స్​పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఒక రైతు పురుగుల మందు డబ్బాతో రావడం కలకలానికి కారణమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎస్సారెస్పీ పరిధిలోని 69, 70, 71 డీబీఎం కాల్వల్లో సరిపడా నీళ్లు లేకపోవడంతో చివరి ఆయకట్టుకి నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. భారీగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్నామని, చేతికొచ్చే వేళ నీళ్లందక నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు.  పంటలు కాపాడుకోవాలంటే మరో 15 రోజులు  పాటు నీళ్లివ్వాలని కోరారు. తర్వాత కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌రెడ్డికి వినతీపత్రం అందించారు.