
మిర్యాలగూడ, వెలుగు : వెంటనే ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కారు. కొనుగోలులో లేట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తిలో అద్దంకి – -నార్కెట్ పల్లి హై వేపైకి వచ్చి ధర్నాకు దిగారు. సెంటర్లలో వడ్లను పోసి రెండు వారాలు కావొస్తున్నా ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎండలకు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎప్పటి నుంచి ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెళ్లి ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే కొనుగోలు చేపట్టేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.