సోయా కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన​

పిట్లం, వెలుగు : సోయా ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా సొసైటీ అధికారులు కొనుగోలు చేయడం లేదని డోంగ్లీ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మద్నూర్, డోంగ్లీ రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. నెల రోజుల క్రితం సోయా పంటను సొసైటీకి తీసుకొచ్చినా ఇప్పటివరకు టోకెన్లు ఇవ్వడం లేదని, తూకాలు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల నుంచి సోయా వద్ద కాపల ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సొసైటీ ఆవరణలో సోయా పేరుకుపోతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయం ఘటనాస్థలానికి చేరుకొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోయా కొనుగోళ్లు కేంద్రం పరిధిలో ఉంటుందన్నారు. త్వరలో రైతుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.