గంభీరావుపేట, వెలుగు: ధాన్యం కొనుగోలులో సంచికి 40 కిలోల 600 గ్రాముల తూకానికి బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు ఆగ్రహించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 43 కిలోల తూకం వేయడంతో ట్రాక్టర్ లోడ్ కు రూ.6 వేలు నష్టపోతామని, ఎక్కువ తూకం వేసి మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటను అమ్మడానికి పోతే మిల్లర్లు, నిర్వాgaహకులు రైతులను దోచుకుంటున్నారన్నారు. సమస్యను స్థానిక లీడర్ల దృష్టికి తీసుకువెళ్తే మిల్ల ర్ల వైపే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. దీంతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి నవీన్ కుమార్ అక్కడకు చేరుకున్నారు. సంచికి 41 కిలోల తూకం వేయాలని, అధికంగా తూకం వేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
పొల్లు పట్టకుండా తూకం వేయాలె..
ముస్తాబాద్ : పొల్లు పట్టకుండానే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండలం కొండాపూర్ రైతులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా- చేశారు. ఈ సందర్భంగా పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి అఖిలపక్షం నేతలు మద్దతు తెలపడంతో సుమారు గంట సేపు ఆందోళన చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ముందు పొల్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని సొసైటీ చైర్మన్ చెప్పి ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. అనంతరం సొసైటీ సీఈఓ కృష్ణ అక్కడికి చేరుకుని పొల్లు పట్టకుండానే ధాన్యం కొంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో చిగురు వెంకన్న ముదిరాజ్, నాగేల్లి దేవయ్య, అయినేని నారాయణరెడ్డి, క్యారమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.