
బెల్లంపల్లి రూరల్, వెలుగు : వడగండ్ల వాన వల్ల పంట మొత్తం నేలపాలైందని, తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వేమనపల్లి మండల కేంద్రంతో పాటు, రాజారాం, మంగెనపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన రైతులు బుధవారం తహసీల్దార్ ఆఫీస్ వద్దకు తరలివచ్చారు. గింజ రాలిన పంటతో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వాన వల్ల మండలంలోని అన్ని గ్రామాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరి పైరు నేలకొరగడంతో పాటు గింజ పూర్తిగా రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు ఎన్నికల విధులపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప పంట నష్టాన్ని మాత్రం పరిశీలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా పొలాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రికార్డు అసిస్టెంట్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు.