భూసేకరణ తిప్పలు .. గందరగోళంగా ఇండస్ట్రియల్ పార్క్​ భూసేకరణ

భూసేకరణ తిప్పలు .. గందరగోళంగా ఇండస్ట్రియల్ పార్క్​ భూసేకరణ
  • పలుచోట్ల అభ్యంతరం తెలుపుతున్న రైతులు
  • భూమికి భూమి కావాలని డిమాండ్​

సిద్దిపేట/కోహెడ, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గంలో టీజీఐఐసీ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కు భూసేకరణ అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. ఇటీవల రైతులతో అధికారులు నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. విలువైన భూములు కోల్పోతున్నందున భూమికి భూమి లేదంటే మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు  డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి పరిధిలో 21మంది రైతులకు చెందిన25.20 ఎకరాలు,  అక్కన్నపేట మండలం జనగామ పరిధిలో 12 మంది రైతులకు సంబంధించి15.20 ఎకరాలు, చౌటపల్లి గ్రామ పరిధిలో 162 మంది రైతులకు సంబంధించి 83.26 ఎకరాల భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 195 రైతుల నుంచి 124.36 ఎకరాలను సేకరిస్తున్నారు. 

గ్రామ సభలో గందరగోళం

చౌటపల్లిలోని 312 సర్వే నెంబర్ లో150 మంది రైతులకు గతంలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.ఈ భూములను ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తుండడంతో వారందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూములు సేకరిస్తే తాము రోడ్డున పడతామని, భూమికి భూమి లేదా బహిరంగ మార్కెట్ ధరలకు రెట్టింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఆర్డీవో రామ్మూర్తి ఆధ్వర్యంలో చౌటపల్లిలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. భూములు కోల్పోతున్న రైతులు భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. 

ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లకు అనువుగా..

హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల ఎక్కువగా పండిస్తారు. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అనువైనదిగా అధికారులు భావిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్​ నిర్మాణం తుది దశకు చేరడంతో అన్ని సీజన్​లలో సాగునీరు లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలు సమీపంలో ఉండడమే కాకుండా హుస్నాబాద్ మీదుగా నేషనల్ హైవే  ఉండడంతో ఉత్పత్తి రవాణాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

మంత్రి పొన్నం  ప్రత్యేక దృష్టి

హుస్నాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో హుస్నాబాద్, కోహెడ, అక్కన్న పేట మండలాల్లోని యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలతో పాటు వలసలకు అడ్డుకట్టపడుతుందన్న విషయాన్ని స్థానికులకు వివరిస్తున్నారు.

భూములిచ్చినంక మేమెట్ల బతకాలె..

నాకు ఉన్నదే 20 గుంటల భూమి. అందులో పంట పండితేనే కుటుంబం బతికేది. జీవనాధారంగా ఉన్న భూమి ఇచ్చినంక మేమెట్ల బతకాలె. భూమికి భూమి లేదంటే మార్కెట్​లెక్క ప్రకారం రెండింతల పరహారం ఇయ్యాలె.

లక్ష్మి, భూ బాధితురాలు, చౌటపల్లి

భూసేకరణ ప్రక్రియ జరుగుతుంది..

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు  భూసేకరణ కోసం రైతులతో గ్రామ సభ నిర్వహించాం. ప్రభుత్వ పరిస్థితిని  రైతులకు వివరించాం. కొంత మంది రైతుల ఇబ్బందులు వెరిఫై చేస్తాం. భూసేకరణ ప్రక్రియ ఐతే ముందుకు సాగుతుంది. 

రామూర్తి, ఆర్డీవో, హుస్నాబాద్