
- రూ. 60 లక్షలు ఇస్తామన్న ఆఫీసర్లు
- కాన్ఫరెన్స్ హాల్ ఎదుట ఆందోళనకు దిగిన నిర్వాసితులు
వరంగల్, వెలుగు : వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ. 2 నుంచి రూ. 3 కోట్లు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల్లో ఆఫీసర్లు సర్వే ప్రారంభించారు. అయితే గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి, నల్లకుంట గ్రామాలకు చెందిన బాధితులు పరిహారం విషయం తేలాకే సర్వే చేయాలని ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గ్రామాల్లో రోడ్లు వేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఆఫీసర్లతో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రైతులతో సమావేశమై న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సర్వేకు ఒప్పుకున్నారు. ఇప్పటివరకు 166 ఎకరాల్లో సర్వే పూర్తికాగా మరో 87 ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంది. అయితే పరిహారం విషయంలో ఆఫీసర్లు, నిర్వాసితుల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు గురువారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వాసితులతో మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఎయిర్‌పోర్ట్ ప్రాంత రైతులతో పాటు స్థానిక అక్షర టౌన్‌షిప్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎకరాకు రూ. 2 నుంచి రూ. 3 కోట్లు చెల్లించాలని కొందరు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మరికొందరు, ప్లాట్లు సైతం కేటాయించాలని ఇంకొందరు డిమాండ్ చేశారు. కాగా ఒక్కో ఎకరానికి సుమారు రూ.60 లక్షలు ఇస్తామని ఆఫీసర్లు చెప్పడంతో నిర్వాసితులు మండిపడ్డారు. ఆ రేటును ఏ ప్రాతిపదికన నిర్ణయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు, టౌన్ షిప్ బాధితులు మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు.