నోయిడా: ఉత్తరప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి పరిహారం పెంచాలనే డిమాండ్‌తో గురువారం గ్రేటర్ నోయిడా నుంచి పార్లమెంట్ ముట్టడికి బయల్దేరారు. రైతుల మెగా ర్యాలీతో ఢిల్లీ–నోయిడా హైవేపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ నుంచి నోయిడా వెళ్లే రూట్ ఐదారు గంటలపాటు స్తంభించిపోయింది. నిరసనకారులు వేలాదిగా తరలిరాగా, నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనేక మందిని అరెస్ట్ చేశారు.
పంజాబ్, హర్యానా రైతుల ట్రాక్టర్ మార్చ్..
మరోవైపు కనీస మద్దతు ధరపై చట్టం, రైతులకు పెన్షన్లు, పంట బీమా, రైతులపై కేసులను కొట్టేయాలనే డిమాండ్లతో పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ దాకా ట్రాక్టర్ ర్యాలీకి మంగళవారం పిలుపునిచ్చారు. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. రైతు సంఘాలతో మాట్లాడేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులను గురువారం చండీగఢ్ కు పంపింది.