మెదక్​ జిల్లాలో వడ్లు కొనాలని రైతుల ఆందోళన 

మెదక్​ జిల్లాలో వడ్లు కొనాలని రైతుల ఆందోళన 
  • తొనిగండ్ల, ఝాన్సీ లింగాపూర్ లో రాస్తారోకో
  • కామారెడ్డి జిల్లా అన్నాసాగర్​లో ధర్నా 

రామాయంపేట, వెలుగు : వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల, ఝాన్సీ లింగాపూర్  గ్రామాల్లోని రైతులు వేర్వేరుగా రోడ్డెక్కి రాస్తా రోకో చేశారు. ధాన్యం 17 తేమ శాతం ఉన్నా తూకం వేయడం లేదని, 13 శాతం ఉంటేనే తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మూడు లారీల వడ్లు తీసుకెళ్లారని, నాలుగైదు లారీల వడ్లు తూకం వేసి ఉన్నాయని తెలిపారు.

కొనుగోలు కేంద్రం వద్ద రోజుల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందని, వడ్లు త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్  చేశారు. గంట పాటు రైతులు ఆందోళన చేయడంతో మెదక్, రామాయంపేట, గవ్వలపల్లి రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

సన్న వడ్లు కొనడం లేదని..

ఎల్లారెడ్డి: సన్న వడ్లు కొనుగోలు చేయడం లేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్​లోని కొనుగోలు సెంటర్ లో రైతులు ఆందోళనకు దిగారు. సన్న వడ్లు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని, సెంటర్​ నిర్వహకుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. అడిషనల్  కలెక్టర్​   విక్టర్​ రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సన్న వడ్లు కొనుగోలు చేయాలని సొసైటీ సీఈవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో ఎక్కువ మంది సన్న వడ్లు పండించామని, సెంటర్​లో పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామని, సన్న వడ్లు కొనుగోలుకు ప్రత్యేక సెంటర్​ ఏర్పాటు చేస్తామని అడిషనల్  కలెక్టర్​ రైతులకు హామీ ఇచ్చారు. సొసైటీ సీఈవో రాంచందర్​కు మెమో జారీ చేస్తామని తెలిపారు. అడిషనల్  కలెక్టర్​ హామీతో రైతులు ఆందోళన విరమించారు.