రామారావు పేటలో మూసివేసిన రోడ్డును వెంటనే తెరవాలి : రైతులు

రామారావు పేటలో మూసివేసిన రోడ్డును వెంటనే తెరవాలి : రైతులు

జైపూర్, వెలుగు: జైపూర్​ మండలం రామారావు పేట శివారులోని పొంట పొలాలకు వెళ్లే రోడ్డును  సింగరేణి అధికారులు మూసి వేయడం సరికాదని ఆ గ్రామస్తులు, రైతులు ఇందారం ఓపెన్ కాస్టు లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ ఇప్పటికే శ్రీరాంపూర్, ఇందారం ఓపెన్ కాస్టుల బాంబు బ్లాస్ట్​లతో ఇండ్ల గోడలు బీటలు వారుతున్నాయని, ఓసీ నుంచి వచ్చే దుమ్ముతో గ్రామస్తులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామం విడిచి పెట్టి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. సింగరేణి అధికారులు గ్రామ రైతులను ఇబ్బంది పెట్టేలా పొలాలకు, చేన్లకు వెళ్లే దారిని మూసివేయడం సరికాదని.. తిరిగి వెంటనే ఓపెన్ వేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో జైపూర్ ఎస్సై శ్రీదర్ అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. నిరసనలో మాజీ ఎంపీటీసీ పెద్దల బాపు, రైతులు నాగరాజు, మునీందర్, రాజన్న, వెంకటేశ్, రవీందర్, సత్తన్న, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక రోడ్డు నిర్మించాం      

రామారావుపేటలో గ్రామస్తులకు, రైతులకు గోదావరి నదికి, పంట పొలాలకు వెళ్లడానికి ఓపెన్ కాస్ట్  ఓబీ డంపుల మధ్య నుంచి ప్రత్యేక రోడ్డు నిర్మించామని సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజలకు  రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రోడ్డును నిర్మించినట్లు తెలిపింది. అటు వైపు వెళ్లే ప్రజలు, రైతులు ఆ రోడ్డును వినియోగించుకోవాలని కోరింది.