కరెంట్​ బందయి.. పంటలెండుతున్నయని ​సబ్​స్టేషన్​ ఎదుట ఆందోళన

  • దిర్శించర్లలో మూడు గ్రామాల రైతుల రాస్తారోకో
  • 10 గంటలు కూడా కరెంట్​ ఇస్తలేరని ఆరోపణ
  • ఎమ్మెల్యే సైదిరెడ్డి హామీతో విరమణ

నేరేడుచర్ల, వెలుగు: కరెంట్ ​సరఫరా సరిగ్గా ఉండడం లేదని సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల సబ్ స్టేషన్ ఎదుట ఉన్న జాన్​పహాడ్​ రోడ్డుపై పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం, ఎల్లాపురం, ముసిఒడ్డు సింగారం గ్రామాల రైతులు రాస్తారోకో చేశారు. తర్వాత సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లోని మోటార్లకు సరఫరా చేసే కరెంట్​ లైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఆ లైన్లు తరచూ తెగిపోయి కరెంట్​ సరఫరా నిలిచిపోతోందని వాపోయారు. నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కనీసం తాగటానికి నీళ్లు కూడా రావడం లేదన్నారు. సరఫరా నిల్చిపోయినప్పుడు విద్యుత్ సిబ్బందికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఎత్తరని, ఎత్తినా కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారని, కానీ, 10 గంటలు కూడా రావడం లేదన్నారు. 

విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ పందిరి శ్రీనివాస్, ఎస్ఐ పరమేశ్​అక్కడకు వచ్చి రైతులకు సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రైతులు ఆందోళన విరమించలేదు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రైతులతో ఫోన్ లో మాట్లాడి 24 గంటలు కరెంటు వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో  విరమించారు.