కేసీఆర్ కు రైతుల ఉసురు తగుల్తది... గ్రీన్ ​ఫీల్డ్​ హైవే అలైన్​మెంట్​మార్చాలని ఆందోళన

  • అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్​ ముట్టడి ఉద్రిక్తం

ఖమ్మం టౌన్, వెలుగు:  నాగ్ పూర్ – అమరావతి గ్రీన్​ఫీల్డ్​హైవే అలైన్​మెంట్​మార్చాలని డిమాండ్​చేస్తూ రఘునాథపాలెం, చింతకాని మండలాల్లోని గ్రామాల రైతులు బుధవారం ఖమ్మం కలెక్టరేట్​ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్​కోకాపేట ఎకరం రూ.100కోట్లు పలుకుతోందని గొప్పలు చెబుతున్న కేసీఆర్, తమ భూములకు కేవలం ఎకరాకు రూ.25లక్షలు నష్ట పరిహారం ఇస్తామనడం దారుణం అన్నారు. తమ మొరను ఆలకించని కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిహారం వద్దని, భూములు కోల్పోకుండా చూస్తే చాలని చెప్పారు. రైతులకు అఖిల పక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపి కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. పోలీస్​బందోబస్తు నడుమ సర్వే చేసి, బలవంతంగా భూములు లాక్కోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరివి నుంచి కోదాడకు, కోదాడ నుంచి అమరావతికి బ్రహ్మాండమైన రోడ్డు ఉందని, కొత్త హైవేతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. కేవలం 12, 13 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని, ఇంత మంది రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమంతారావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపంధా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.