- కల్లాల పైసలపై బీజేపోళ్లను అడగాలన్న కేటీఆర్‌కు రైతు కౌంటర్
- అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయున మంత్రి
- సిరిసిల్ల జిల్లా జిల్లెల్లలో సమస్యలపై రైతుల నిలదీత
- పంటలు ఎండినంక నీళ్లిస్తే ఏం లాభమని ఫైర్
తంగళ్లపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లెల్ల గ్రామం వెళ్లిన మంత్రి కేటీఆర్ ను రైతులు పలు సమస్యలపై నిలదీశారు. కల్లాలు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వలేదని, రంగనాయక సాగర్‌నుంచి కాల్వల నిర్మాణం ఏండ్లకేండ్లు ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో జిల్లెల్ల గ్రామ స్కూల్లో ల్యాబ్ఓపెనింగ్కోసం కేటీఆర్ వచ్చారు. ఓపెనింగ్ తర్వాత స్కూల్ నుంచి బయటకు వచ్చిన మంత్రిని స్థానిక రైతులు కలిసిశారు. కల్లాలు నిర్మించుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఈ సందర్భంగా రైతు లింగారెడ్డి అడిగారు. దీనిపై స్పందించిన కేటీఆర్ కల్లాల పైసల విషయంలో రూ.192 కోట్లు బలిమీటికి కేంద్రానికి వాపస్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కల్లాల పైసలు పీఎం మోడీ, బీజేపోళ్లను అడుగంటూ రైతుకు సూచించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పైసలు రైతులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం లేటు చేయడంతోనే పైసల్ వాపస్ వెళ్లినయ్, మీరు టైమ్‌కు రైతులకు ఇస్తే పైసలు వాపస్ ఎందుకు వెళ్తయి” అని లింగారెడ్డి మంత్రిని ప్రశ్నించారు. రంగానాయక సాగర్‌నుంచి కాల్వల నిర్మాణం ఆలస్యం చేయడంతో చెరువులోకి నీళ్లు రావడం లేదని మిగతా రైతులు అన్నారు. మరో 15 రోజుల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పొలాలు మొత్తం ఎండినంక నీళ్లు ఇస్తే ఏంలాభమని మండిపడ్డారు. దీంతో అసహనానికి గురైన కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఓట్లకు వచ్చినప్పుడు చెప్తం: మహిళలు
సమస్యలు చెప్పుకుందామని వస్తే కేటీఆర్ టైమ్ ఇవ్వలేదని జిల్లెల్ల గ్రామానికి చెందిన దళిత మహిళలు ఫైర్ అయ్యారు. అగ్రికల్చర్ కాలేజీలో భూములు కోల్పోయామని తమకు న్యాయం చేయాలని మంత్రిని కలవడానికి మహిళలు స్కూల్ వద్దకు వచ్చారు. బిల్డింగ్ఓపెన్ చేసిన తర్వాత కేటీఆర్ వీరిని కలవకుండానే నుంచి వెళ్లిపోయారు. తమ గోడు చెప్పుకుందామని వస్తే కలవకుండానే వెళ్లిపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సంగతి చెప్తామంటూ మండిపడ్డారు.