రోడ్డెక్కిన రైతులు.. ఎండను లెక్క చేయక అన్నదాతల రాస్తారోకో 

రోడ్డెక్కిన రైతులు.. ఎండను లెక్క చేయక అన్నదాతల రాస్తారోకో 

రోడ్డెక్కిన రైతులు.. ఎండను లెక్క చేయక అన్నదాతల రాస్తారోకో 
పలుచోట్ల ధాన్యం తగులబెట్టి నిరసన
సీఎం ఇలాకాలోనూ నిరసన 

వెలుగు నెట్​వర్క్ ​: ధాన్యం తూకం వేయడంలో  ఆలస్యం, కాంటా పెట్టిన వడ్లు రైస్​మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడాన్నినిరసిస్తూ శుక్రవారం పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. మండుతున్న ఎండను లెక్కచేయకుండా రోడ్ల  మీద రాస్తారోకోలు చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ నియోజకవర్గ పరిధిలోనూ రైతులు రోడ్డెక్కారు. ధ్యాన్నాన్ని  తరలించేందుకు  లారీలు రాకపోవడంతో  మెదక్​ జిల్లా చేగుంట మండలం పులిమామిడి వద్ద  రైతులు రాస్తారోకో చేశారు. ఎర్రటి ఎండలో రోడ్డుపై  బైఠాయించారు.  వడ్ల సంచులను తగులబెట్టారు. ఇదే మండలం మక్కా రాజుపేట వద్ద కూడా  లారీలను పంపించాలని చేగుంట,  గజ్వేల్ రోడ్డుమీద  రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం చెప్పినా తడిసిన ధాన్యాన్ని కొనడం లేదని చిన్నశంకరంపేట మండల రైతులు  చేగుంట,  మెదక్   రోడ్డుపై రాస్తారోకో చేశారు. వడ్ల సంచులకు నిప్పంటించి నిరసన తెలిపారు. తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు  తహసీల్దార్ ఆఫీస్​ వద్దకు వచ్చి మెయిన్​ రోడ్డుపై ఆందోళన చేశారు. ధాన్యాన్ని తగలబెట్టి నిరసన తెలిపారు. 15 రోజులుగా లారీలు పంపాలని అడుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.   పోలీసులు   రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. 

మెదక్​జిల్లాలో...

పది రోజుల నుంచి  లారీలు రావడం లేదని మెదక్​ జిల్లా నర్సాపూర్​లో  రైతులు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. మెదక్,  హైదరాబాద్​ నేషనల్​ హైవే మీద వడ్ల ట్రాక్టర్లు నిలిపి, వడ్లకు నిప్పు పెట్టారు.  డప్పులు కొడుతూ నిరసన తెలిపారు.  సీఎంకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  ఆందోళనకు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్​, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి, అసెంబ్లీ కన్వీనర్​ మల్లేశ్​ గౌడ్​ మద్దతు తెలిపారు.   మాయిశ్చర్​ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.  అక్కడకు వచ్చిన   తహసీల్దార్​, పోలీసులకు.. రైతులకు  మధ్య వాగ్వాదం జరిగింది.  ట్రాఫిక్​ జామ్​ కావడంతో  నాయకులను, రైతులను పక్కకు గుంజేశారు.   

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

తడిసిన   ధాన్యాన్ని కొనడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట మెయిన్​ రోడ్డుపై రైతులు  రాస్తారోకో చేశారు.   తేమశాతం ఎక్కువుందని కాంటాలు పెట్టడంలేదని,  తడిసిన ధాన్యాన్ని కొనడంలేదని  తేమ పేరిట  ఐదు కిలోల తరుగు తీస్తున్నారని రోడ్డుపై బైఠాయించారు.  గంట పాటు ఆందోళన చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్​ జామయ్యింది. సమస్యను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తామని  మండల వ్యవసాయ అధికారి సాయి చెంతన్ కుమార్,  సీఐ సీహెచ్ శ్రీనివాసరావు  హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.  

పెద్దపల్లి జిల్లా మంథనిలో...

నెల రోజుల నుంచి ధాన్యం కొనడంలేదంటూ పెద్దపల్లి జిల్లా మంథని  వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రైతులు  వడ్లు పోసి  తగలబెట్టారు.  తడిసిన ధాన్యాన్ని కొనడం లేదంటూ  ధర్నా చేశారు.    బస్తాకు రెండు కిలోల తరుగుకు ఒప్పుకున్నా.. కొర్రీలు పెడుతున్నారని, వడ్లను మిల్లులకు పంపేందుకు లారీలు  అందుబాటులో లేవని వాపోయారు.   ట్రాఫిక్ జామ్ కావడంతో మంథని ఎస్ఐ వెంకటేశ్వర్లు ధర్నా విరమించాలని కోరినా  వినలేదు. చివరకు  మంథని తహసీల్దార్​ బండి ప్రకాశ్ వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విరమించారు. కాంటాలు వేసిన వడ్లను తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్  ఆధ్వర్యంలో రైతులు నల్గొండ జిల్లా కట్టంగూర్​ తహసీల్దార్​ ఆఫీసును  ముట్టడించి ధర్నా చేశారు.   కొనుగోలు కేంద్రాల వద్ద  ఇంకా 85 శాతం వడ్లు  కల్లాల్లోనే ఉన్నాయని కాంగ్రెస్​ లీడర్​  దైద రవీందర్ ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు,   రైతులు పాల్గొన్నారు.