భారతదేశం పూర్తిగా వ్యవసాయ దేశం. నూటికి 75 శాతం గ్రామీణ ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 35% మంది వ్యవసాయ కూలీలు. 30% మేరకు పేద రైతులు,10 శాతం వరకు మధ్యతరగతి రైతులు, వీరందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో కోట్లాది మందికి జీవనోపాధి కల్పిస్తూ, దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న రైతాంగం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు వర్ణనాతీతం. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రైతుల పాలిట ఉరితాళ్లు అవుతున్నాయి. ప్రపంచీకరణ విధానాలు శరవేగంగా అమలవుతుండటంతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా దీనికి తోడవడంతో వ్యవసాయ రంగంపై పెనుభారం పడింది.
నేడు వ్యవసాయం రైతులకు లాభసాటిగా లేకుండా పోయింది. ఆరుగాలం కష్టించి పండించినా.. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. పంటలకు ఎంఎస్పీ ధర నిర్ణయించకపోవడం, కొన్ని పంటలకు ఎంఎస్పీ నిర్ణయించినప్పటికీ మార్కెట్లో కొనే నాథుడు ఉండటం లేదు. పంటలు నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కొన్ని పెట్టినప్పటికీ దళారీల కారణంగా గిట్టుబాటు ధర లేని దుస్థితిని చూస్తున్నాం.
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందా?. రైతుల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్రం కావాలనే విస్మరిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత నెల రోజులుగా చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. 2020-–21లో జరిగిన ఆందోళన సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ఇచ్చిన హామీ అమలు, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, రుణమాఫీ, పెన్షన్ వంటి డిమాండ్లపై రైతన్నలు నిరసన తెలుపుతున్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల భారతరత్న ప్రకటించింది.
వారి ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరను కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలును గట్టిగా సమర్థిస్తూ అమలు చేయాలని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత దానిని విస్మరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ తీవ్ర ప్రచారం చేశారు. మోదీ రెండోసారి గెలుపొందడంలో ఇది కీలకమైన అంశం. కానీ, ప్రధాని మోదీ, బీజేపీ దీనిపై మాట తప్పారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమిస్తుంటే నిర్బంధాలు
దేశ రక్షణ కోసం, వ్యవసాయ రంగాన్ని బతికించుకోవటం కోసమే ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది. కాబట్టి రోజు రోజుకి ప్రజా మద్దతు పెరుగుతున్నది. మీడియా హైలైట్ చేసి చూపకపోయినా అంతర్జాతీయంగా సంఘీభావం దక్కుతుంది. ఇప్పటికైనా మోదీ సర్కార్ దిగొచ్చి కనీస మద్దతు ధర చట్టం చేయాల్సిందే. రైతు రుణమాఫీతోపాటు, గత ఉద్యమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయడం, ఇతర డిమాండ్లను పరిష్కరించాల్సిందే. రైతుల ఉద్యమం తిరిగి ప్రారంభం కావడానికి మోదీ ప్రభుత్వం వైఖరియే కారణం. గత కొన్ని రోజులుగా ఢిల్లీ సమీపంలోనూ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 23 ఏండ్ల శంభోకరన్ సింగ్ అనే యువరైతు బుల్లెట్ గాయాలతో చనిపోవడంతోపాటు ఈ దాడిలో 25 మందికి పైగా రైతులకు బలమైన గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనికి ప్రధాన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే. మూడేండ్ల కిందట రైతు ఉద్యమాన్ని చల్లబరచటానికి గురునానక్ జయంతి రోజు దేశ ప్రజానీకానికి మోదీ క్షమాపణ చెప్పారు. మూడు చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని, కనీసం మద్దతు ధర చట్టం తీసుకొస్తామని బహిరంగంగా ప్రకటించి మాట తప్పారు. అందుకే రైతుల ఉద్యమం మళ్లీ మొదలైంది.
అన్నదాతల ఉద్యమానికి ఆదరణ
దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతన్నల పోరాటాన్ని.. ఓ పోరాటంగా చూడొద్దు. రైతాంగ మనుగడ, వ్యవసాయ రక్షణ కోసం జరుగుతున్న పోరాటంగా మనం భావించాలి. తాము బతకాలి, వ్యవసాయాన్ని బతికించుకోవాలని లక్ష్యంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా రోడ్లమీదకు వస్తున్నారు. అందుకే ప్రజల నుంచి విశాల మద్దతు లభిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇంత భారీ మద్దతు ఏ పోరాటానికి దక్కలేదు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఫిబ్రవరి 16న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలిపారు. ఫిబ్రవరి 23న అన్ని రాష్ట్ర రాజధానుల్లో బ్లాక్ డే నిర్వహించారు. 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతాంగంపై లాఠీచార్జీ, ఇతర దాడులు చేయడంతో ఇప్పటికే నలుగురు రైతులు అమరులైనారు. రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ మోదీ ప్రభుత్వం.. రైతాంగ వ్యతిరేకతను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరసనలను సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే మార్చి 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జాతీయస్థాయి మహా పంచాయితీని తలపెట్టాలని నిర్ణయించింది.
వ్యవసాయ రంగంపై వివక్ష
మోదీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నది. కేంద్రం చూపు మాత్రం కార్పొరేట్ సంస్థలపై ఉన్నది. వారికి తాము చెల్లించాల్సిన పన్ను రేట్లను తగ్గించి తాయిలాలు ప్రకటిస్తున్నది. కార్పొరేట్ పన్ను రేటును 30% నుంచి 22 శాతానికి భారీగా తగ్గించింది. కొత్తగా ఏర్పాటు అయిన కంపెనీలకు పన్ను రేటును 25% నుంచి 15 శాతానికి తగ్గించింది. పన్ను రేట్ల చర్యల ఫలితంగా ఖజానాకు రూ.1,45,000 కోట్ల నష్టం వాటిల్లింది. పన్ను తగ్గింపుల వల్ల కార్పొరేట్ సంస్థలు రూ.6 లక్షల కోట్లు ఆర్జించాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే కోట్లాదిమంది భారతీయులకు ఆహార భద్రతను, జీవనోపాధిని కల్పిస్తున్న వ్యవసాయ రంగం చాలా కాలంగా నష్టపోతున్నది. అలాంటి రంగానికి చేయూతనందించాల్సిన మోదీ సర్కార్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించటం, రైతులకు అందించే ఎరువులు, విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీలను తగ్గిస్తూ వ్యవసాయంపై మరింత భారం మోపుతున్నారని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో వ్యవసాయ సంక్షోభం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
- ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్ నేత