ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను నిరసిస్తూ.. రాష్ట్రంలో పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు, ఎగుమతుల్లో జాప్యానికి నిరసనగాశనివారం (మే 20) జగిత్యాల నిజామాబాద్ ప్రధాన రహదారిపై చల్ గల్ వద్ద రైతులు ఆందోళన చేశారు. సకాలంలో ధాన్యం కాంటా వేయకపోవడంతో ..మళ్లీ కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిందని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. రోజుల తరబడి ధాన్యం కాంటా వేయకపోవడంతో అకాల వర్షాలకు 2వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసి... కొన్ని రాశుల్లో ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం మొత్తం తడిసిపోయిందని మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కొనుగోల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
చల్ గల్ లోని అతిపెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రమైనప్పటికీ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మాయిశ్చర్ వచ్చిర ధాన్యాన్ని ఐకేపీ అధికారులు కొనడం లేదని నిరసన తెలిపారు. నాలుగు రోజుల్లో మార్కెట్ యార్డులో ఉన్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అకస్మాత్తుగా వర్షం పడటంతో ధాన్యంపై కప్పడానికి కనీసం పరదాలు కూడా ఇవ్వడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.