
- పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేలకొండపల్లి మండలం
- ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ ఆధ్వర్యంలో భూభారతిపై అవగాహన సదస్సులు
ఖమ్మం/ నేలకొండపల్లి, వెలుగు: భూ భారతి పోర్టల్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో 112 మంది రైతులు తమ భూ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వీటిలో ఎక్కువగా ధరణి తప్పులపై వచ్చినవే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం భూ భారతి పైలట్‌ప్రాజెక్టుగా ఎంపికైంది. దీంతో, జిల్లా ఇన్చార్జి కలెక్టర్శ్రీజ ఆధ్వర్యంలో మండలంలోని నాచేపల్లి, చందాపురం రెవెన్యూ గ్రామాల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కొత్త పాస్‌పుస్తకాల్లో భూ విస్తీర్ణంలో తప్పులు, సాదాబైనామాలపై దరఖాస్తు చేసుకున్నారు. ధరణి పోర్టల్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. లంచాలు తీసుకొని, ఒకరి భూమిని మరొకరి పేరిట పట్టా చేయడం, భూమి లేకపోయినా పాస్ పుస్తకాలు ఇవ్వడం, భూమి ఉన్నా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం వంటి అనేక తప్పులు చేశారన్నారు. అర్జీలు తీసుకున్న అధికారులు వారికి రశీదు ఇచ్చారు.
పోర్టల్‌పై అవగాహన పెంచుకోవాలి
నాచేపల్లి సదస్సులో ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ మాట్లాడారు. కొత్తగా వస్తున్న భూ భారతి పోర్టల్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో నేలకొండపల్లి ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు. గతంలో ధరణి పోర్టల్ ద్వారా జరగని న్యాయం భూ భారతిలో జరుగుతుందని తెలిపారు. ఏటా డిసెంబర్ 31న రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేస్తామన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూ వివాదాల పరిష్కారానికి భూ భారతి పోర్టల్ఉపయోగపడుతుందని తెలిపారు. ధరణితో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారన్నారు. 18 రాష్ట్రాల్లో భూ చట్టాలను పరిశీలించి, భూ భారతికి రూపకల్పన చేశామని పేర్కొన్నారు. అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతిలోని సెక్షన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇందులో ఉంటుందని చెప్పారు. భూమి కలిగిన ప్రతీ రైతుకు భూధార్ కార్డు ఇస్తామన్నారు. భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే రూ.300 చెల్లించి, భూ భారతిలో దరఖాస్తు చేయాలని, తహసీల్దార్ సంబంధిత కాపీ ఇస్తారని తెలిపారు.
రైతుల సూచనలు..
సదస్సులో రైతులు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత ప్రభుత్వాలు బంచరాయి, ఇనాం భూములు ఇచ్చాయని, వాటికి పట్టాలు ఇప్పించి, బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఆ భూములను వారసత్వంగా వచ్చేలా చట్టంలో మార్పులు చేయాలని కోరారు. చెరువులు, ప్రభుత్వ భూములు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే చేపట్టాలని సూచించారు. గ్రామంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు భూములపై తహసీల్దార్ కు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూదాన్ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, రైతులు నెల్లూరి భద్రయ్య, శాఖమూరి రమేశ్, బొడ్డు బొందయ్య, ఏటుకూరి రామారావు, గుడవర్తి నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.