కామారెడ్డిలో రైతులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిజాంసాగర్ చౌరస్తాను దిగ్బంధనం చేశారు. రాస్తారోకో, ధర్నా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్దన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘‘మాస్టర్ ప్లాన్ తో మా బతుకులు ఆగం చేయొద్దు.. రైతులను నిండా ముంచే కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలి. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తాం..’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులు అరగంటకుపై చౌరస్తాను దిగ్బంధించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మాస్టర్ ప్లాన్ తో తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో భూములు లాక్కుంటే ఊరుకోబోమన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరించారు.
ఇండస్ట్రియల్ జోన్ అనేది పట్టణానికి 10 లేదా 20 కిలోమీటర్ల దూరం ఉండాలి.. కానీ ఇక్కడ సిటీలో పెడుతున్నారు.. రైతుల పొలాలు పోయినా సరే.. ప్రజల ఆరోగ్యాలు పోయినా సరే.. మేం మాత్రం బాగుండాలి.. అభివృద్ధి చెందాలి.. కేవలం మా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగుండాలని కుట్రపూరితంగా చేశారని రైతులు ఆరోపించారు.
గ్రామస్తులు.. సామాన్య ప్రజలు... పొలాలు లేని వారు తమకెందుకులే అని తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పరిశ్రమలు పెడితే.. కాలుష్యం పెరిగి అందరి ఆరోగ్యాలు దెబ్బతింటాయనే విషయం గుర్తించాలని, రైతుల ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రజలు రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తామని ప్రకటించాలని పిలుపునిచ్చారు.