
- సాగు చేసుకుంటున్న భూములు ఇవ్వబోమంటున్న రైతులు
- బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం కంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్
- పరిహారం పెంపులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణ
హనుమకొండ/ పరకాల, వెలుగు: రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంచడంతోపాటు దూరభారాన్ని తగ్గించేందుకు కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణ తిప్పలు తప్పడం లేదు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఉమ్మడి వరంగల్ మీదుగా విజయవాడకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్-163జీ) ను నిర్మిస్తుండగా, చాలాచోట్లా భూములు ఇచ్చేందుకు అక్కడి రైతులు అంగీకరించడం లేదు. రూ.కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం అగ్వకే లాక్కునే ప్రయత్నం చేస్తోందని, సాగు భూముల్లోంచి రోడ్డు వేస్తే తాము జీవనాధారం కోల్పోతామంటూ ల్యాండ్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
వివిధ సందర్భాల్లో నిరసనను తెలియజేస్తూ ఆందోళనలు కూడా చేపట్టారు. కాగా, అధికారులతో పలుమార్లు చర్చల అనంతరం బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, కంపెన్సేషన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిహారం పెంపు కోసం ఆఫీసర్లు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
భూసేకరణకు అడ్డంకులు..
రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ మాల పరియోజనలో భాగంగా నాగపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నాగపూర్ నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా విజయవాడ వరకు మొత్తంగా 577 కిలోమీటర్ల మేర రోడ్డు వేయనుండగా, దీని ద్వారా దాదాపు 178 కి.మీల దూరం తగ్గుతుందని అంచనా. కాగా, 2023 జులై 8న వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ చేతుల మీదుగా మంచిర్యాల-వరంగల్ సెక్షన్ పనులకు శంకుస్థాపన కూడా చేశారు.
ఇదిలాఉంటే మంచిర్యాల-వరంగల్ సెక్షన్ లో 108 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 589 హెక్టార్లు, వరంగల్-ఖమ్మం సెక్షన్ లో 108 కి.మీల నిర్మాణానికి 568 హెక్టార్లు మొత్తంగా 1,157 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా, ఎన్హెచ్ఏఐ అధికారులు పలుమార్లు సర్వేలు కూడా చేశారు.
కానీ, ఆఫీసర్ల సర్వే ప్రకారం గ్రీన్ ఫీల్డ్ హైవే చాలా వరకు సాగు భూముల్లోంచి వెళ్తుండటంతో రోడ్డు నిర్మాణానికి భూములు ఇస్తే తాము జీవనాధారం కోల్పోతామంటూ రైతులు మొదట్నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ భూనిర్వాసిత రైతులంతా కలిసి దాదాపు మూడేండ్ల నుంచి ఉద్యమం చేస్తున్నారు. తమ భూములు లాక్కోవద్దంటూ లీడర్లు, ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి మరీ కొందరు రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ముందుకు సాగని ప్రక్రియ..
మంచిర్యాల-వరంగల్ సెక్షన్ లో మంచిర్యాల జిల్లా నర్వా నుంచి పెద్దపల్లి జిల్లా పుట్టపాక, పుట్టపాక నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి, పంగిడిపల్లి నుంచి హనుమకొండ జిల్లా ఊరుగొండ వరకు మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టేందుకు కసరత్తు చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అధికారులు గుర్తించిన రూట్ లో భూములన్నీ రూ.కోట్లు విలువ చేస్తుండగా, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో ఎకరానికి రూ.10 లక్షల వరకు మాత్రమే పరిహారం వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ ద్వారా రూ.30 లక్షల వరకు పరిహారం చెల్లించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. కానీ రూ.కోట్లు విలువ చేసే భూములకు రూ.లక్షల్లో ఇవ్వడమేంటని, కొందరు రైతులు కోర్టుకు కూడా వెళ్లారు.
దీంతోనే గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణ ప్రక్రియ సగం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లాలో 1,195 రైతుల నుంచి 141 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా, అందులో 118 హెక్టార్లను సేకరించి ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. మొత్తంగా 507 మంది రైతులకు రూ.37.38 కోట్లు పరిహారం చెల్లించగా, మరో 688 మంది రైతులకు రూ.27.35 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలో పరిస్థితి ఇలా ఉండగా మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రైతులతో మరోసారి సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
న్యాయం జరిగేదాకా పోరాడుతాం
గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల సాగును నమ్ముకుని బతికే రైతులంతా జీవనాధారం కోల్పోవాల్సి వస్తోంది. అందుకే కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నాం. రూ.కోట్లు విలువ చేసే భూములకు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాల్సిందిగా ఆఫీసర్లకు పలుమార్లు విన్నవించాం. రైతులకు న్యాయం జరిగేలా పరిహారం చెల్లింపులు జరగడం లేదు. న్యాయం జరిగే వరకు పోరాడుతాం. - బూర్గుల రాంచందర్, శాయంపేట మండలం
ఓపెన్ మార్కెట్ రేటు కట్టియ్యాలె...
నాకున్న రెండెకరాల భూమి గ్రీన్ ఫీల్డ్ హైవే కిందనే పోతాంది. ఆ భూమి లేకపోతే మా కుటుంబానికి జీవనాధారమే లేదు. అధికారులు ఎకరానికి రూ.12.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంటున్నరు. ఇదెక్కడి న్యాయం. రైతుల గురించి కూడా ఆలోచించి ఓపెన్ మార్కెట్ రేటు కట్టివ్వాలి.- నల్లెల సతీశ్, పరకాల
మార్కెట్ రేట్ చెల్లించాలని డిమాండ్..
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి గుర్తించిన భూములు బహిరంగ మార్కెట్ లో రూ.కోట్లు విలువ చేస్తుండగా, అధికారులు నిర్ణయించిన పరిహారం ఏమూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో బహిరంగ మార్కెట్ ప్రకారం భూములకు ధర కట్టిస్తే తాము సొంతంగా ల్యాండ్ ఇస్తామని నిర్వాసిత రైతులు చెబుతున్నారు. పరిహారం విషయం తేల్చకుండా కొన్ని చోట్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సర్వేలు, పంట పొలాల తొలగింపు చేపట్టగా రైతులు అడ్డుకుంటున్నారు.
ఇటీవల వరంగల్ జిల్లా నెక్కొండలో పంట పొలాలను ధ్వంసం చేస్తుండటంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ నెల 13న హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కానిపర్తిలో ఆఫీసర్లు సర్వే నిర్వహిస్తుండగా, అక్కడి రైతులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.