మెట్పల్లి, వెలుగు ఏడాదికి రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములు నేషనల్ హైవే 63 లో బైపాస్ రోడ్డుకు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు. నేషనల్ హై వే 63 ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఫోర్ లైన్ నిర్మాణానికి ఇటీవల నిధులు మంజూరయ్యాయి. మెట్ పల్లి, కోరుట్ల డివిజన్ పరిధిలో మెట్ పల్లి మండలం (బొమ్మల) మేడిపల్లి నుంచి తూర్పు మేడిపల్లి మండల కేంద్రం వరకు 31 కిలోమీటర్లు మేర బైపాస్ రోడ్డుకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీ సర్వేయర్లు ఉన్నతాధికారులకు సర్వే నివేదికను అందజేశారు. బైపాస్ నిర్మాణానికి కావాల్సిన భూముల వివరాలు ఏ సర్వే నంబర్ లో ఉన్నాయి. ఎంత భూమి అవసరం ఉంది. పట్టా పాస్ బుక్ నంబర్లు, పేర్లతో సహా సుమారు 123 హెక్టార్ల భూమి అవసరం ఉన్నట్లు ఆయా గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో నోటీసులు అంటించారు. దీంతో ఒక్కసారిగా నోటీసులను చూసిన రైతులు కంగుతిన్నారు. బైపాస్ రోడ్డు పేరిట విలువైన భూములను లాక్కునేందుకు సర్కారు కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏయే గ్రామాల్లో భూమి పోతుందంటే..
మెట్ పల్లి మండలం బండలింగపూర్, వెల్లుల్ల, మేడిపల్లి, చౌలమద్ది, పెద్దపూర్ గ్రామాల పరిధిలో 57.76 హెక్టార్లు, కోరుట్ల డివిజన్ పరిధిలో కోరుట్ల, ఏకిన్ పూర్, సంగెం, వెంకటపూర్, గుమ్లాపూర్, మోహన్రావు పేట, మేడిపల్లి పరిధిలో 65.14 హెక్టార్ల వ్యవసాయ భూమి బైపాస్ రోడ్డు కోసం సేకరించడానికి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ నెల18న పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. భూములు కోల్పోయే రైతులు నోటీస్ అందిన 20 రోజుల్లోపు తమ అభ్యంతరాలు తెలపాలని కోరారు. ఎన్ హెచ్ 63 గ్రీన్ ఫీల్డ్ హైవే బైపాస్ రోడ్డు నిర్మాణం పేరిట భూములు తీసుకునే సర్వే నంబర్లతో సహా పంచాయతీల్లో నోటీస్ బోర్డుపై పెట్టడంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ నిలిపివేయాలని కోరుతూ వెల్లుల్ల రైతులు మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు.
వ్యవసాయంపై ఆధారపడిన దాదాపు రెండు వందల రైతుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.కోట్ల రూపాయల విలువచేసే వ్యవసాయ భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఒక్క వెల్లుల్ల గ్రామంలోనే 66 సర్వే నంబర్లలో 577, 668.9000 చదరపు మీటర్ల భూమిలో బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు పంచాయతీ ఆఫీస్ లో నోటీసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా భూములను లాక్కుంటే మాకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.35 లక్షలకు ఎకరం కొన్న
వెల్లుల్ల గ్రామ శివారులో నాలుగు నెలల క్రితమే సర్వే నంబర్ 387 లో ఎకరానికి రూ.35 లక్షలు పెట్టి వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన. ఇప్పుడేమో ఆ భూమిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తామంటున్నరు. ఉన్నదంతా అమ్మి వచ్చిన డబ్బుతో ఈ భూమి కొనుగోలు చేసిన. రోడ్డు కోసం నా భూమి లాక్కుంటే నాతో పాటు నా కుటుంబానికి ఆత్మహత్యే దిక్కు.
- నీలి రాజేష్, రైతు, వెల్లుల్ల
మా భూముల్లో బైపాస్ రోడ్ నిర్మాణం తగదు
రూ. కోట్లు విలువ చేసే భూముల్లో బైపాస్ రోడ్డు నిర్మించడం సరికాదు. నా సర్వే నంబర్ 225 లో బైపాస్ రోడ్డు కోసం 4623 చదరపు మీటర్ల భూమి రోడ్డుకు ఇవ్వాలని నోటీస్ లో పెట్టారు. మాకు వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయం చేసే సారవంతమైన భూములు రోడ్ల నిర్మాణం కోసం తీసుకోవడం దారుణం. బైపాస్ నిర్మాణం పై సర్కారు పునరాలోచించాలి.
- మారు మురళీధర్ రెడ్డి, రైతు, వెల్లుల్ల
భూములు ఇయ్యం
317 లో ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయ చేసుకుని బతుకుతున్నాం. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న భూమిలో మా సర్వే నంబర్ ఉంది. మా కుటుంబ పోషణకు ఆ భూమే ఆధారం. చావనైనా చస్తం గానీ భూమిని బైపాస్ రోడ్డు నిర్మాణానికి అస్సలు ఇయ్యం.
- నాగులపల్లి చిన్న గంగారాం, రైతు, వెల్లుల్ల