‘మాస్టర్ ప్లాన్’ రద్దు చేసే వరకు తగ్గేది లేదంటున్న  రైతులు

కామారెడ్డి, వెలుగు: ‘కామారెడ్డి డ్రాఫ్ట్​ మాస్టర్ ప్లాన్’ పై  అభ్యంతరాల గడువు ముగియడంతో తదుపరి పరిస్థితి ఏమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మాస్టర్​ ప్లాన్​పై అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుందా.?  తగ్గుతుందా.? అనే  అంశం ఇప్పుడు జిల్లాలో హాట్​ టాఫిక్​గా మారింది. మాస్టర్ ​ప్లాన్​ సవరణ, రద్దు ఇలా  అభ్యంతరాలు  భారీ సంఖ్యలోనే వచ్చాయి.  మాస్టర్ ​ప్లాన్​ రద్దయ్యే చేసే వరకు ఉద్యమిస్తామని బాధిత రైతులు చెబుతుండగా, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు మున్సిపల్ విలీన గ్రామాలకు చెందిన  కౌన్సిలర్లు పదవులకు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం చేసింది.   

కౌన్సిలర్ల రాజీనామాకు పట్టు

మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా  గత 40 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నారు. అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తీర్మానించారు. మున్సిపాలిటీలో విలీనమైన అడ్లూర్, ఇల్చిపూర్​, టెకిర్యాల్, దేవునిపల్లి, లింగా పూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్​పల్లి కి చెందిన గ్రామాల నుంచి 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా  ఈ నెల 20 లోగా తమ పదవులకు  రాజీనామాలు చేయాలని రైతులు తీర్మానించారు. లేకపోతే వారి ఇండ్ల ఎదుట ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.  రాజీనామాలు చేస్తే పార్టీలకతీతంగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటా మని ప్రకటించారు. గ్రామాల వారీగా రైతులు మీ టింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు. శుక్రవారం  హైదరాబాద్​లో హెచ్​ఆర్​సీని కూడా ఆశ్రయించారు. 

పరిశీలన తర్వాత పరిస్థితి ఏమిటి..?

మాస్టర్​ప్లాన్​లో  చూపెట్టిన ఆయా జోన్లకు వ్యతిరేకంగా 2,734 అభ్యంతరాలు రాగా  స్థానిక ఆఫీసర్లు  పరిశీలిస్తున్నారు.  వీరు విభాగాల వారీగా పరిశీలించి ఉన్నతాధికారులకు రిపోర్టు ఇవ్వనున్నారు.  మున్సిపల్​ మీటింగ్​ ఏర్పాటు చేసి  మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని రైతులు 49 మంది కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు. అభ్యంతరాల పరిశీలన,  ఉన్నతాధికారులకు రిపోర్ట్​ఇవ్వడం పూర్తయిన తర్వాతే  మున్సిపల్​ మీటింగ్​ ఏర్పాటు చేయటానికి అవకాశమున్నట్లు తెలిసింది.  మరో వైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ ఆర్​ కూడా స్పందించారు.  ప్రజల అభీష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. మాస్టర్​ ప్లాన్​తో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని  స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ పేర్కొన్నారు.  ఇది డ్రాఫ్ట్​ప్లాన్​ మాత్రమేనని  కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ చెబుతున్నారు.  ఇండస్ర్టియల్,  గ్రీన్, రీక్రియేషన్​ జోన్,  విలీన గ్రామాల మీదుగా కొత్తగా ప్రతిపాదించిన100, 80 ఫీట్ల రోడ్లపై  అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి.  ఆయా వర్గాల నుంచి  మాస్టర్​ ప్లాన్​పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్లాన్​ను ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ ప్రస్తుతం ఉన్నట్లుగా మాస్టర్​ ప్లాన్​ను ఆమోదిస్తే అధికార పార్టీకి  రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే  రైతులు చేస్తున ఉద్యమంతో  ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సవరణలు చేసే అవకాశమే ఎక్కువగా ఉందని  ఆఫీసర్లు చెప్తుండడం గమనార్హం.