
- కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా వడ్లు కొనడం లేదని ఆగ్రహం
- సూర్యాపేట – దంతాలపల్లి రోడ్డుపై ముళ్ల కంచె వేసి ధాన్యాన్ని తగులబెట్టిన రైతులు
సూర్యాపేట, వెలుగు : వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనడంలో జాప్యం చేస్తున్నారంటూ పలువురు రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా వద్ద సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై ముళ్లకంచె వేసి, రోడ్డుపై ధాన్యం తగులబెట్టి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గుర్రంతండాలో నెల రోజుల కింద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో సుమారు 200 మంది రైతులు 30 వేల బస్తాల వడ్లను తీసుకొచ్చారన్నారు.
కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షం, గాలి దుమారం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు నామమాత్రంగా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబడ్డారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేయగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తమను అడ్డుకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. ఇదే టైంలో నెమ్మికల్ వైపు వెళ్తున్న మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపారు. చివరకు కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ధాన్యం కోనాలని గంభీరావుపేటలో రైతుల ఆందోళన
రాజన్న సిరిసిల్ల, వెలుగు : కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వడ్లను త్వరగా కొనాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద కామారెడ్డి – సిద్దిపేట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేరుకే సెంటర్లు ప్రారంభించిన ఆఫీసర్లు.. వడ్లను మాత్రం కొనుగోలు చేయడం లేదన్నారు.
ఐకేపీ సెంటర్‌కు తీసుకొచ్చిన వడ్ల అకాల వర్షాలతో తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఆఫీసర్లు స్పందించి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రేమానందం ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.