సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ ప్లాన్​ ఖరారు .. రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు

సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ ప్లాన్​ ఖరారు .. రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు
  • నల్గొండ జిల్లాలో 11.50 లక్షల ఎకరాల్లో పంట సాగు 
  • పత్తి, వరి సాగుపైనే మొగ్గుచూపుతున్న రైతులు

నల్గొండ, వెలుగు : ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో 6,17,480 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 11,50,556 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఈసారి వరి వైపు కాకుండా ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించడంతో నల్గొండ జిల్లాలో ఈ ఖరీఫ్ లో పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. 

నల్గొండ జిల్లాలో 11, 50,556 ఎకరాల్లో సాగు.. 

నల్గొండ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 11,50,556 ఎకరాల్లో పంట సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి 5,47,409 ఎకరాలు, వరి 5,24,551 ఎకరాలు, ఉద్యానవన పంటలు 73,104 ఎకరాలు, కంది 2,829 ఎకరాలు, ఇతర పంటలు 1924 ఎకరాలు సాగు చేస్తారని తెలిపారు. గతేడాది పోలిస్తే ఈసారి పత్తి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలో సాగర్, మూసీ, ఏఎంఆర్పీ, చెరువులు, బోరుబావుల కింద పంట సాగు చేస్తున్నారు. 

సూర్యాపేట జిల్లాలో 6,17,480 ఎకరాల్లో సాగు.. 

సూర్యాపేట జిల్లాలో రానున్న వర్షాకాలంలో 6,17,480 ఎకరాల్లో పంట సాగు కానుంది. అత్యధికంగా వరి 4,85,215 ఎకరాలు, పత్తి 91 వేల ఎకరాలు సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది వానాకాలంలో 6,34,400 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని భావించిన 6,13,888 ఎకరాల్లో సాగు చేశారు. ఆరుతడి పంటలైన కంది 7,500 ఎకరాలు, పెసర 4 వేలు, వేరుశనగ 1,250 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసిన అధికారులు సాగు చేసేందుకు రైతులు ముందుకురాలేదు. 

అందుబాటులో విత్తనాలు, ఎరువులు.. 

సూర్యాపేట జిల్లాలో సాగయ్యే 4,85,215 ఎకరాలకు 87,322 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం పడనున్నాయి. కంది 2,650 ఎకరాలకు 159 క్వింటాళ్లు, పెసర 2,700 ఎకరాలకు 108 క్వింటాళ్లు, జొన్నలు 45 ఎకరాలకు 5 క్వింటాళ్లు, వేరుశనగ 400 ఎకరాలకు 360 క్వింటాళ్ల విత్తనాలు కావాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత రెండో స్థానంలో ఉండే పత్తి విత్తనాలు 2,27,500 ప్యాకెట్లు రైతులు వినియోగించనున్నారు. ఇక 8,580 ఎకరాల్లో పచ్చిరొట్టె విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ నివేదికలు పంపారు. నల్గొండ జిల్లాలో పత్తి విత్తనాలు 16.81 లక్షల ప్యాకెట్లు, వరి విత్తనాలు 1,26,800 క్వింటాళ్లు, కంది 1,250 క్వింటాళ్లు, పెసర 149 క్వింటాళ్లు, వేరుశనగ 1545 క్వింటాళ్లు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.