
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ అనుబంధ సంస్థలు రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అగ్రి కార్పొరేషన్లను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మంత్రి తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‌లో ఆగ్రోస్, హాకా, టీజీఆర్ఐసీ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రభుత్వ అనుబంధ సంస్థలు రైతులకు సమర్థవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు.
హాకాఎండీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంస్థను బలోపేతం చేసే దిశగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. రూరల్ ఇరిగేషన్ కో ఆపరేటివ్ సొసైటీలో దశాబ్ద కాలంగా ఆడిట్ జరగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ..ఇప్పటికే నమోదైన ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్(ఎఫ్ పీఓ)లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆగ్రోస్ సంస్థ గత ఏడాదిగా నిర్వహించిన కార్యక్రమాలను సంస్థ ఎండీ రాములు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగ్రోస్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఒకే కార్యకలాపాలను నిర్వహించే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమీక్షలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, హాకా ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, వేర్హౌసింగ్ఎండీ డాక్టర్కె. లక్ష్మి, అగ్రోస్ ఎండీ కె.రాములు, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.