కో ఆపరేటివ్​ సొసైటీలను రైతులు ఆదరించాలి

కో ఆపరేటివ్​ సొసైటీలను రైతులు ఆదరించాలి
  • 9 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేసినం: మంత్రి పొన్నం
  • కో ఆపరేటివ్  క్రెడిట్ , బ్యాంకింగ్ నిర్మాణంపై నేషనల్ కాన్ఫరెన్స్ 

హైదరాబాద్ ,వెలుగు: విత్తనాలు, ఎరువులు  కో ఆపరేటివ్ సొసైటీల్లోనే తీసుకోవాలని, వాటిని ఆదరించాలని రైతులను మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. దేశంలో కో ఆపరేటివ్ బ్యాంకుల బలోపేతానికి  మాజీ   ప్రధాని మన్మోహన్ సింగ్,  మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని  తెలిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల పెద్ద సంఖ్యలో కో ఆపరేటివ్ బ్యాంకులు, బ్రాంచీలు ఏర్పాటు అయ్యాయని, రైతులకు అండగా నిలిచాయని తెలిపారు.

నాటి యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు రూ. 72 వేల కోట్ల రుణమాఫీ చేయడంతో కో ఆపరేటివ్ వ్యవస్థలో ఎక్కువ శాతం లోన్లు మాఫీ అయ్యాయని, తర్వాత ఇదే బ్యాంకుల్లో రైతులు ఎక్కువ లోన్లు తీసుకున్నారని చెప్పారు. సోమవారం హైదరాబాద్​ సోమాజిగూడలోని ఓ హోటల్ లో  కో ఆపరేటివ్  క్రెడిట్, బ్యాంకింగ్ నిర్మాణంపై జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ లో  కర్నాటక మంత్రి రాజన్న, నాఫ్స్ కాబ్ ( నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ ) చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎండీ బీమ సుబ్రమణ్యంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం కో ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా స్టార్ట్ అయిందని, అనంతరం డీసీసీబీ ప్రెసిడెంట్, మార్క్​ఫెడ్​ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే అయ్యాయని, ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పారు. 2005లో తాను, రవీందర్​రావు కో ఆపరేటివ్ సెక్టార్ లో కలిసి పనిచేశామని, నేషనల్ కాన్ఫెరెన్స్ లో  భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. రేషన్​కార్డు లేని వారికి త్వరలో మాఫీ చేస్తామని చెప్పారు.