- కరెంట్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన
- పంటలు ఎండిపోతున్నాయని గద్వాల జిల్లా మాచర్ల సబ్ స్టేషన్ ఎదుట ధర్నా
గద్వాల, వెలుగు : కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు బుధవారం గద్వాల జిల్లా గట్టు మండలంలోని మాచర్ల విద్యుత్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అక్కడే వంట చేసుకుని భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ కరెంట్ కోతలతో వేరుశనగ, మిరప, పత్తి పంటలు ఎండిపోతున్నాయన్నారు. కరెంట్కోతలపై సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆపరేటర్లను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతోందని, కానీ ఇక్కడ మాత్రం కనీసం 10 గంటలు కూడా రావడం లేదన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే తప్ప ఎక్కడా 24 గంటల కరెంట్ఇవ్వడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆవేద వ్యక్తం చేశారు. ఆఫీసర్లు ఫోన్ చేసి కరెంటు సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.