
- ఎండిపోతున్న పంటలను కాపాడాలి
- సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
మునగాల, వెలుగు: శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటిని విడుదల చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. శ్రీరామ్ సాగర్ నుంచి నీటిని చివరి ఆయకట్టు కింద ఉన్న పెన్ పహాడ్, మునగాల మండలాల్లో సుమారు 20 వేల ఎకరాలకు సకాలంలో నీటిని అందించడంలో ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఈ కారణంగా ఆయా మండలాలకు చెందిన రైతులు తీవ్ర నష్టాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. ఆత్మకూరు మండలంలో కోటి నాయక్ తండా, చివ్వెంల మండలంలో కాశీంపేట దగ్గర ఉన్న పెద్ద కాలువ వద్ద రైతులు నీటిని రాకుండ అడ్డుకుంటున్నారని వాపోయారు.
ఎండిపోతున్న పంటలకు ప్రతి ఎకరాకు రూ. 25 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి సరఫరాను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాంబాబు, ఇరిగేషన్ శాఖ ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నెమ్మది ఫీరయ్య, నెలమర్రీ మాజీ ఎంపీటీసీ సభ్యులు శివాజీ, లాల్, రాములు, గోపి, సుధాకర్, గుర్రం వెంకట రెడ్డి, రవి, సీతారాం నాయక్, గాంధీ, చంద్రు, అమ్రోజీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.