
కల్వకుర్తి, వెలుగు: రైసు మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు కుమ్ముక్కై బస్తా వడ్లకు 9 కిలోల తరుగు తీస్తున్నారని మండలంలోని తర్నికల్ రైతులు బుధవారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ మిల్లర్లు ఐకేపీ సెంటర్ వద్దకు వచ్చి తరుగు తీయమని చెప్పి వడ్లు కొన్నారని, డబ్బులు ఇచ్చేటప్పుడు బస్తాకు 9 కిలోల తరుగు పేరుతో డబ్బులు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులంతా కలిసి తమను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మిల్లర్లపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.