పరిహారం తేల్చకుండా పనులు కానివ్వం

మేఘా.. గో బ్యాక్ 

కంపెనీ ప్రతినిధులను ఎక్కడికక్కడ వెళ్లగొడుతున్న రైతులు

పరిహారం తేల్చకుండా ఊళ్లలో సర్వేకు వస్తున్న కంపెనోళ్లు, ఆఫీసర్లు

భూముల్లో అడ్డగోలుగా హద్దుల జెండాలు

కోటిలింగాల నుంచి మల్లన్నసాగర్​ దాకా 95 కిలోమీటర్ల పొడవునా సర్వే, కెనాల్​ పనులు

జగిత్యాల/ సిద్దిపేట/వెల్గటూరు, వెలుగు: భూముల సర్వేకు, కాల్వలు తవ్వేందుకు ఊళ్లలోకి వస్తున్న మేఘా కంపెనీ ప్రతినిధులపై, ఆఫీసర్లపై రైతులు మర్లవడుతున్నరు. పరిహారంపై తేల్చకుండా అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరిస్తూ వెనక్కి పంపుతున్నారు. జేసీబీలు, ఇతర వెహికల్స్​కు అడ్డుపడి ‘మేఘా.. గో బ్యాక్​’ అంటూ నినాదాలు చేస్తున్నరు. ప్రస్తుతం కోటిలింగాల నుంచి మల్లన్నసాగర్​ దాకా 95 కిలోమీటర్ల పొడవునా భూసేకరణ సర్వే, కెనాల్స్, పైపులైన్​పనులు జరుగుతుండగా ఆయా జిల్లాల్లోని రైతులు.. ఎక్కడికక్కడ తిరగబడుతున్నరు. తమ భూముల్లో తమ పర్మిషన్​ లేకుండా, పరిహారం ఎంత ఇస్తరో చెప్పకుండా పనులు చేయడమేమిటని మండిపడుతున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పేరుతో మరోసారి ముంచాలని చూస్తే ఊరుకోబోమని తేల్చి చెబుతున్నరు. ముందు పరిహారం సంగతి తేల్చాలంటున్నరు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్​కు అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేందుకు ప్రభుత్వం రూ. 21వేల కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ థర్డ్​ టీఎంసీ కాంట్రాక్ట్​ను కూడా దక్కించుకున్న మేఘా కంపెనీ పనులను స్పీడప్​ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద రూ. 500 కోట్లతో ఆరు మోటార్లను బిగించే పనులు దాదాపు పూర్తికావచ్చాయి. అప్రోచ్  చానల్స్, గ్రావిటీ   కెనాల్స్ తవ్వడంతోపాటు పైపులైన్లు, లిఫ్టులు, పంప్​హౌస్​లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే కొన్నిచోట్ల పనులు స్టార్ట్​ అయ్యాయి.

అడుగడుగునా నిరసనలు

ప్రాజెక్టు పనుల్లో భాగంగా జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో సర్వేల కోసం వస్తున్న ఇరిగేషన్​, రెవెన్యూ ఆఫీసర్లను, కెనాల్స్, పైపులైన్స్​​తవ్వేందుకు వస్తున్న మేఘా కంపెనీ ఇంజినీర్లు, వర్కర్స్​ను  రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కింద జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల, వెల్గటూర్, రాజక్కపల్లి, దమ్మన్నపేట, ముత్తునూర్, పెగడపల్లి మండలం దీకొండ, ల్యాగలమర్రి, రాం భద్రునిపల్లి, పెగడపల్లి, ఏడు మోటల పల్లి, నామాపూర్, గంగాధర మండలం కోట్ల నరసింహుల పల్లి, బూరుగుపల్లి, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, ఒబులాపూర్​, వల్లంపట్ల, రహీంఖాన్​పేట, వెల్దిపూర్, అనంతారం, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి విఠలాపూర్‌‌‌‌,  మాచాపూర్‌‌‌‌,  గంగాపూర్‌‌‌‌, చంద్లాపూర్‌‌‌‌, రామంచ, సిద్దిపేట మండలం పుల్లూరు, చిన్నగుండవెల్లి,  బూర్గుపల్లి, ఇర్కొడు,  ఎన్సాన్‌‌‌‌పల్లి,  వెంకటాపూర్‌‌‌‌, తడకపల్లి, తొగుట మండలం బండారుపల్లి,  ఎల్లారెడ్డిపేట, ఘనపూర్‌‌‌‌, తుక్కాపూర్‌‌ ‌‌గ్రామాల్లో ని రైతులు సుమారు 1300 ఎకరాల భూములను కోల్పోతున్నారు. ఎకరానికి ఎంత పరిహారం ఇస్తారో చెప్పకుండా రెవెన్యూ ఆఫీసర్లు భూసేకరణ చేస్తున్నారు. మేఘా కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ భూముల్లోకి వస్తున్న ఆఫీసర్లు.. జీపీఎస్​ సాయంతో తమకు అవసరమైన కాడికి హద్దు జెండాలను పాతుకుంటూ వెళ్తున్నారు. అనుమతి లేకుండా తమ భూముల్లో కొద్ది రోజులుగా సాగుతున్న సర్వే పనులను రైతులు అడ్డుకొని నిరసన తెలుపుతున్నారు. జెండాలను పీకేసి, కంపెనీ ఇంజినీర్లను, గవర్నమెంట్​ ఆఫీసర్లను వెనక్కి పంపుతున్నారు. జగిత్యాల జిల్లాలో మేఘా కంపెనీ జేసీబీలు, వెహికల్స్​తో పనులు స్టార్ట్​ చేయగా, వాటి ముందు బైఠాయించి ధర్నాలకు దిగుతున్నారు. ముందు పరిహారం ఎంతో లెక్క తేల్చి, పైసలు ఇచ్చిన తర్వాతే పనులు స్టార్ట్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఓపెన్​ మార్కెట్​కు తగ్గట్టు పరిహారం ఇవ్వాల్సిందే

ప్రభుత్వం ఎకరాకు రూ. 5 లక్షలు ఇచ్చే ఆలోచనలో ఉందని గ్రామాల్లో ప్రచారం జరగడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇటీవల వెల్గటూర్​ మండలం నామాపూర్​కు రెవెన్యూ ఆఫీసర్లు, మేఘా ఇంజినీర్లు  సర్వేకు రావడం తో రైతులు జేసీబీ ఎదుట కూర్చొని అడ్డుకున్నారు. ఓపెన్​ మార్కెట్​లో తమ గ్రామంలోని భూములు ఎకరానికి రూ. 40 లక్షలు పలుకుతున్నాయని, అంతే మొత్తం ఇవ్వకపోతే పనులు జరగనివ్వమని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల రైతులు ఎకరానికి కనీసం రూ. 20 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. సిద్దిపేట సమీపంలోని విలువైన భూముల్లోంచి కాల్వలు, పైప్‌‌‌‌ లైన్ లు వేయడాన్ని అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఎకరాకు కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. దీంతో పలు ఊళ్లలో రెవెన్యూ ఆఫీసర్లు గ్రామ సభలు నిర్వహించినా భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అన్ని ఊళ్లలోనూ రైతులు ఏదో రూపంలో నిరసన తెలుపుతున్నా సర్కారు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. సిద్దిపేట మండలంలోని చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి రైతులు ఇటీవలే రిలే నిరాహార దీక్షలు  చేశారు. చిన్నకోడూరు మండలం రామంచ, సిద్దిపేట రూరల్‌‌  మండలం చిన్నగుండవెల్లి, తొగుట  మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన సుమారు 300‌‌‌‌ మంది రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.  సిద్దిపేట మండలం  చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన 80 మంది స్టే తెచ్చుకున్నారు.

అక్కడ 6 వేల మంది కార్మికులు రోడ్డుపాలు

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో పెద్దవాగు పక్కన నిర్మిస్తున్న పంప్ హౌస్​ కింద పదుల ఎకరాల్లో విస్తరించిన ఈతవనం పోతున్నది. 200 గీత కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్తున్నాయి. దీంతో పనులను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వెల్గటూర్​లో 32 క్వారీలు, 18 క్రషర్లను బంద్​ పెట్టాలని ఆఫీసర్లు నోటీసులు పంపడంతో యజమానులు, 6 వేల మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పకుండా మూసేయమంటూ నోటీస్ లు ఎలా పంపుతారని ప్రశ్ని స్తే.. ఆఫీసర్ల వద్ద ఆన్సర్​ లేదు. తామంతా రోడ్డునపడాల్సి వస్తోందని కార్మికులు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు.

రెండోసారీ భూమి పోతున్నది

నాకున్న 5 ఎకరాల20 గుంటల భూమి ఎల్లంపల్లి డ్యామ్ కింద పోయింది. వచ్చిన డబ్బుతో వెల్గటూరు శివారులో భూమి కొని సాగుచేసుకుంటున్న. మళ్లీ ఇప్పుడు థర్డ్​ టీఎంసీ పనుల కోసం నా భూమిల్నే పంప్ హౌస్ కడ్తరట. భూమి పోతది పరిహారం ఇస్తమని ఆఫీసర్లు అంటున్నరు. ఎంత ఇస్తరో చెప్తలేరు. ఈ టీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చినంక  మాలాంటోళ్ల భూములు ఎన్నిసార్లు ముంపులో పోతయో తెలుస్తలేదు. పరిహారం కాదు.. భూమికి బదులు భూమి ఇయ్యాలి.

– శ్రీనివాస్, రైతు, ముత్తునూర్, జగిత్యాల జిల్లా

ముందు పరిహారం ఎంతో తేల్చాలి

కాళేశ్వరం మూడో టీఎంసీ పనుల కోసం మా భూములు తీసుకుంటరట. కాలువలు తవ్వి ఎక్కడికో నీళ్లు కొంటపోతరట. కానీ మాకు ఎంత పరిహారం ఇస్తరో ఇప్పటికీ చెప్తలేరు. పనులు మాత్రం స్టార్ట్​ చేసిన్రు. ఇదెక్కడి న్యాయం? మా భూములు తీసుకునేముందు పైసలియ్యాలె కదా.  మాకు ఎవుసం చేసుకుంటెనే బతుకెళ్తది. పైసలిస్తే ఇంకోకాడ భూమి కొనుక్కుంటం.

– లశెట్టి లక్ష్మి, రాజక్కపల్లి, జగిత్యాల జిల్లా

విలువైన భూములు ఎట్లిస్తం?

సిద్దిపేట పరిసరాల్లో ఎకరాకు కోటి రూపాయలు ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎటూ సరిపోదు. ఇప్పటికే ఓ కాలువ ఉండగా, ప్యారలర్‌‌గా మరో కెనాల్‌‌ తవ్వడం కరెక్ట్ కాదు. మొదటి కాలువ కోసం అనేక మంది రైతుల నుంచి తక్కువ రేట్లకు భూమి తీసుకున్నరు. మళ్లీ రెండో కాలువ కోసం రైతులను ఇబ్బంది పెడితే ఎట్ల? ముందుగానే రెండు టీఎంసీలకు బదులు మూడు టీఎంసీలకు రీడిజైన్‌ చేసుకుంటే ప్రజాధనం వృథా అయ్యేది కాదు. రైతులకూ ఇంత నష్టం జరిగేది కాదు. అందుకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

– రాజారాంగారి చంద్రారెడ్డి , చిన్నగుండవెల్లి, సిద్దిపేట జిల్లా